అనతి కాలంలోనే టాప్ కామెడీ షో ఎదిగి మంచి ఆదరణ పొందిన షో జబర్దస్త్. ఒక్క మాటలో చెప్పాలంటే బహుశా షో ఈ రేంజ్‌లో నడుస్తుందని.. ఇంతకాలం నెట్టుకొస్తామని సదరు షో నిర్వహిస్తున్న యాజమాన్యం కానీ.. ప్రసారం చేసుకునే యాజమాన్యం సైతం ఊహించి ఉండదేమో మరి. అయితే ఇప్పుడు ఆ షో ఏ మేరకు నడుస్తుందా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు కారణం షోలోని కమెడియన్స్ మొదలుకుని జడ్జ్ వరకూ సైడ్ అవ్వడమే ఇందుకు కారణం. అసలు జబర్దస్త్‌కు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది..? నిజంగానే యాజమాన్యంతో నవ్వుల నవాబు నాగబాబుకు గొడవలొచ్చాయా..? అనే విషయాలను ఇప్పటికే నాగబాబు.. ‘మై చానెల్ నా ఇష్టం’ యూట్యూబ్ చానెల్ వేదికగా కాసింత క్లారిటీ ఇచ్చుకున్నారు. ఇప్పటికే ఓ వీడియో విడుదల చేసిన ఆయన తాజాగా మరో వీడియోను రిలీజ్ చేశాడు.
ఎవరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే..!
జబర్దస్త్ షోతో పాటు.. ప్రజారాజ్యం, కాంగ్రెస్, వైసీపీ పార్టీల ప్రస్తావన కూడా నాగబాబు తెచ్చాడు. వాస్తవానికి ఆ రెండు పార్టీలకు షోకు ఎలాంటి సంబంధం లేదు కానీ.. నాగబాబే ఈ పార్టీల ప్రస్తావన తెస్తూ వీడియోలో కాస్త వివరించాడు. ‘నేను ఈటీవీలో అదుర్స్ అనే షో చేస్తుండగా.. మేనేజర్ ఏడుకొండలుతో మంచి ర్యాప్ ఏర్పడింది. అలా నేను నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిని కలిశాను. ఆయన అప్పటి వరకూ నాకు డైరెక్ట్‌గా ఫోన్ చేయలేదు. ఏడుకొండలే శ్యాం ప్రసాద్ రెడ్డికి నన్ను పరిచయం చేశారు. వాళ్ల మల్లెమాల బ్యానర్ నుంచి అదుర్స్.. తర్వాత జబర్దస్త్ కామెడీ షో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ షోకు జడ్జీగా వ్యవహరించాలని నన్ను కోరారు. అయితే ఎవరికీ తెలియని సీక్రెట్ ఏంటంటే.. శ్యాం ప్రసాద్ గారికి గానీ.. నాకు గానీ ఇంత లాంగ్ షో చేస్తామని తెలియదు.. ఎవరికీ తెలిసుండదు కూడా. కేవలం జబర్దస్త్‌ను 25 ఎపిసోడ్స్ కోసమే ప్లాన్ చేసుకున్నాం. ఆ షోకు మీరు.. నాతో పాటు రోజాను జడ్జిగా ఉండాలని కోరారు. రోజాను జడ్జీగా వ్యవహరించాలని కోరడం కూడా ఓ ట్విస్టే. కానీ అప్పటికే నేను ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ వైపు వెళ్లడం.. రోజా తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరాము. అయితే పొలిటికల్‌గా ఉండే విభేదాలు ఉండొచ్చు కాని.. క్రియేటివ్ ఫీల్డ్‌లో అలా ఉండకూడదని ఆరోగ్యవంతమైన వాతావరణంలో రోజా నేను జబర్దస్త్ చేయాలనే నిర్ణయానికి వచ్చాం. అందుకే.. ఇద్దరం కలిసి షో చేశాం’ అని నాగబాబు చెప్పుకొచ్చాడు.
అదృష్టం ఏంటంటే ఈ షోకు తిరుగులేని రేటింగ్ రావడం.. 4 రేటింగ్ రావడమే ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ జబర్దస్త్‌కి మాత్రం 6 నుంచి మొదలై 15 వరకూ పెరిగింది. దీంతో ఆ 25 ఎపిసోడ్స్ తర్వాత కూడా కంటిన్యూ చేశామన్నారు. ఈ విషయాలతో పాటు సదరు షో డైరెక్టర్స్, యాంకర్స్ గురించి కూడా నాగబాబు ప్రస్తావన తెచ్చారు. అయితే షో నుంచి క్విట్ అయ్యి వేరే చానల్‌కు ఎందుకు జంప్ అవ్వాల్సి వచ్చిందనే అసలు విషయం మాత్రం నాగబాబు ఇంతవరకూ చెప్పకుండా నాన్చుతూనే ఉన్నాడు.. మరి అసలు సంగతేంటో.. ఎప్పుడు చెబుతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదేమో.