‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని మొదటిపాట ‘అరెరే అరెరే’ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్
ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6న విడుదలకు సిద్ధమైన ‘ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్’ ల ‘మిస్ మ్యాచ్’
‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్‌ను పొందిందీ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6న ‘మిస్ మ్యాచ్’ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్‌లు ఇటీవలే మీడియాకు అధికారికంగా ప్రకటించారు. ‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని మొదటిపాట ‘అరెరే అరెరే’ను దర్శకుడు త్రివిక్రమ్ ఈరోజు(సోమవారం) విడుదల చేసారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడుతూ.. ‘మిస్ మ్యాచ్’ టైటిల్ కొత్తగానూ, ఆసక్తిని కలిగించేదిగానూ ఉంది. డైరెక్టర్ నిర్మల్ తీసిన సలీమ్ సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. తెలుగులో అతను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న ‘మిస్ మ్యాచ్’ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్‌కు గుడ్ లక్. ‘మిస్ మ్యాచ్’ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్‌కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. ఇప్పుడు రిలీజ్ అయిన ‘అరెరే అరెరే’ మెలోడీ సాంగ్, వినాలనిపించేదిగా ఉంది.. అన్నారు.
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. నా అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ ‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్నా అన్నారు. నా మొదటి సినిమా ‘ఆట గదరా శివ’ సినిమాకు త్రివిక్రమ్‌గారు సపోర్ట్ చేశారు. మళ్ళీ ఈ సినిమా సాంగ్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు.
నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ... స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌గారు సాంగ్ రిలీజ్ చెయ్యడం హ్యాపీగా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. డిసెంబర్ ఆరున చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈరోజు విడుదల అయిన ఈ గీతం తరువాత మరో రెండు గీతాలను ఒకదాని తరువాత మరొకటి విభిన్నంగా విడుదల చేయబోతున్నాము అని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి ప్రముఖ దర్శకుడు ‘క్రిష్’ చేతుల మీదుగా విడుదల అయిన ‘మిస్ మ్యాచ్’ తొలి ప్రచార చిత్రాలు, విక్టరీ వెంకటేష్‌గారు విడుదల చేసిన చిత్రం టీజర్, అలాగే ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేసిన చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి మరోసారి కృతఙ్ఞతలు తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ఇలియాస్ మాట్లాడుతూ... సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి. ‘అరెరే అరెరే’ సాంగ్ త్రివిక్రమ్‌గారి చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషం. శ్రేష్ఠ గారు ఈ పాటను రచించారు, ఎమ్. ఎమ్. మనస్వి పాడడం జరిగింది. ఆడియన్స్ అందరికి ఈ సాంగ్ నచ్చుతుందని భావిస్తున్నాను.. అన్నారు.
డైరెక్టర్ ఎన్. వి.నిర్మల్ మాట్లాడుతూ.. ‘అరెరే అరెరే’ పాట ఒక మెలోడీ, రొమాంటిక్ నెంబర్ ఈ సాంగ్. శ్రోతలకు త్వరగా నచ్చే సాంగ్ ఇది. గిఫ్టన్ కంపోజిషన్‌లో మనస్వి చక్కగా పాడడం జరిగింది. త్రివిక్రమ్‌గారు ఈ సాంగ్ రిలీజ్ చెయ్యడంతో ఆడియన్స్‌కు ఈ సాంగ్ మరింత చేరువవుతుందని భావిస్తున్నాను.. అన్నారు.