70 వసంతాలు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ తొలిసినిమా ‘మనదేశం’ నిర్మాణ సారథికి సురేష్ కొండేటి అభినందనలు
నటరత్న నందమూరి తారక రామారావును వెండితెరకు పరిచయం చేసిన ‘మనదేశం’ సినిమా విడుదలై ఈరోజుకు 70 వసంతాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్రనిర్మాణ సారధి, ఆ చిత్ర కథానాయిక కృష్ణవేణిని ‘సంతోషం’ పత్రిక అధినేత, నిర్మాత సురేష్ కొండేటి కలిసి ఆమెకు పుష్పగుచ్ఛం ఇచ్చి ప్రత్యేకంగా అభినందించారు. 1930-1940వ
దశకంలోని కథానాయికల్లో ఇంకా జీవించి ఉన్నది ఆమె ఒక్కరే. 96 ఏళ్ల వయసులోనూ ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. ఎం.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ పతాకంపై మీర్జాపురం రాజా నిర్మించిన ఈ చిత్రానికి ఆమె సమర్పకురాలిగా ఉన్నారు. ఆమె రాజాగారి సతీమణి కూడా. ఈ సినిమా 1949 నవంబరు 24న విడుదలైంది. కృష్ణవేణి పాదాలకు సురేష్ కొండేటి నమస్కరించి ఆశీర్వచనం తీసుకున్నారు.
ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ.. తాను సినిమా పరిశ్రమకు వచ్చిన తొలినాళ్లలో వారి ఇంట్లోనే పెరిగానని, ఆమె కుమార్తె ఎన్.ఆర్. అనురాధాదేవి నిర్మించిన కొన్ని చిత్రాలకు కూడా తను సహకారం అందించానన్నారు. వారి కుటుంబంతో తనకు ఉన్న ఆత్మీయానుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని అన్నారు. ఆమె పూర్ణాయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. తెలుగు సినిమా రంగానికి ఆమె చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.