‘గీత గోవిందం’ తర్వాత దర్శకుడు పరశురామ్ సినిమా ఏదీ పట్టాలెక్కలేదు. స్టార్ హీరోల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ.. పరశురామ్‌ని పట్టించుకున్న పాపాన పోలేదు. చివరికి పరశురామ్ యంగ్ హీరో నాగ చైతన్య దగ్గర ఆగినట్లుగా వార్తలొస్తున్నాయి. దాదాపుగా నాగ చైతన్యతో పరశురామ్ సినిమా ఖాయమని, ఆ సినిమాని 14 రీల్స్ నిర్మాతలు తెరకెక్కిస్తున్నట్లుగా ఫిలింనగర్ టాక్. పరశురామ్ చెప్పిన కథకి నాగ చైతన్య కనెక్టయ్యాడని తెలుస్తుంది. అయితే చైతూతో మాత్రమే కాకుండా సమంతతో కూడా పరశురామ్ సినిమా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది.
నాగచైతన్య వెంకిమామ, శేఖర్ కమ్ముల సినిమాల తర్వాత పరశురామ్ సినిమా కోసం రెడీ అవుతాడట. అంటే అజయ్ భూపతి మహాసముద్రానికి చైతు హ్యాండ్ ఇచ్చినట్లే అన్నమాట. ఇక చైతు సినిమా తర్వాత పరశురామ్ సమంతతో ఓ లేడి ఓరియెంటెడ్ మూవీని చేయబోతున్నట్లుగా.. ఇప్పటికే సమంతకి కథ చెప్పి కమిట్మెంట్ పొందినట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పటివరకు సినిమా కోసం తెగ తిరిగిన పరశురామ్ ఇలా ఒకేసరి భార్యా భర్తలతో సినిమాల్తో బిజీ కాబోతున్నాడన్నమాట. సినిమా సినిమాకి గ్యాప్ వస్తే వచ్చింది కానీ... పరశురామ్‌కి చైతు - సామ్ లు ఓకే చెబితే సుడి తిరిగినట్లే.