‘వీరశాస్తా అయ్యప్ప కటాక్షం’ హీరోగా నా నూరవ చిత్రం కావడం నా అదృష్టం -సుమన్
తెలుగులో హీరోగా 99 సినిమాలు చేశాక గ్యాప్ వచ్చింది. ఇంతలో రాఘవేంద్రరావుగారి ‘అన్నమయ్య’లో వేంకటేశ్వరస్వామి పాత్ర చేసే అదృష్టం వచ్చింది. అప్పటి నుంచి క్యారక్టర్ రోల్స్ చేసుకుంటూ వస్తున్నాను. తెలుగులో హీరోగా నూరవ చిత్రం ‘వీరశాస్తా అయ్యప్ప కటాక్షం’ కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో నా తొలిచిత్రం ‘ఇద్దరు కిలాడీలు’ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకులు రేలంగి నరసింహారావు సమక్షంలో నా నూరవ చిత్రం ట్రైలర్ విడుదల కావడం సంతోషంగా ఉంది. ఇందుకు కారకులు, ఈ చిత్రానికి కథ, స్క్రేన్ ప్లే, మాటలు, పాటలు సమకూర్చిన నిర్మాత వి.ఎస్.పి.తెన్నేటి గారికి థాంక్స్. నా సూపర్ హిట్ సినిమా ‘అలెగ్జాన్డర్’ కి ఆయన మాటలు రాశారు. ఇక నేను పని చేసిన మంచి దర్శకుల జాబితాలో ఈ చిత్ర దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ కూడా ఉంటారు. చాల అద్భుతంగా తెరకెక్కించారు ఈ చిత్రాన్ని.. అన్నారు ఎవర్ గ్రీన్ హీరో సుమన్.
100 క్రోర్స్ అకాడమీ-వరాంగి మూవీస్ సంయుక్తంగా రుద్రాభట్ల వేణుగోపాల్ దర్సకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వీరశాస్త అయ్యప్ప కటాక్షం’. ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త వి.ఎస్.పి.తెన్నేటి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు సమకూర్చడంతో పాటు టి.ఎస్. బద్రీష్ రామ్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఏ.జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ళ, చలపతి, మాస్టర్ హరీంద్ర, అశోక్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్ ఫిలిం ఛాంబర్ లో శాస్త్రబద్ధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదలయ్యింది. హీరో సుమన్ తెలుగులో నటించిన తొలి చిత్ర దర్శకనిర్మాతలు రేలంగి నరసింహారావు-తమ్మారెడ్డి భరద్వాజ హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
అయ్యప్ప కరుణాకటాక్షాలతోనే ఈ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని, శంకర్ మహదేవన్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వంటి దిగ్గజాలతో పాడించి.. మా మ్యూజిక్ డైరెక్టర్ వి.ఎస్.ఎల్.జయకుమార్ అందించిన ఆడియో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, అయ్యప్ప ఆశీస్సులతో సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని దర్సకనిర్మాతలు వి.ఎస్.పి.తెన్నేటి-టి.ఎస్.బద్రీష్ రామ్, రుద్రాభట్ల వేణుగోపాల్ అన్నారు.
ఈ చిత్రానికి ఎడిటర్: క్రాంతి, కెమెరా: వేణు మురళీధర్-వడ్నాల, సంగీతం: వి.ఎస్.ఎల్.జయకుమార్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-పాటలు: వి.ఎస్.పి.తెన్నేటి, నిర్మాతలు: వి.ఎస్.పి.తెన్నేటి- టి.ఎస్.బద్రీష్ రామ్, దర్శకత్వం: రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్.వి.జి)