తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏ నోట విన్నా దాదాపు ‘జార్జిరెడ్డి’.. ‘జార్జిరెడ్డి’ అనే పేరే వినపడుతోంది. మరోవైపు గూగుల్‌ను అసలు ఎవరీ జార్జిరెడ్డి అని తెగ అడిగేస్తున్నారు. మరోవైపు యూ ట్యూబ్‌లో వీడియోల కోసం వెతుకుతున్నారు. జార్జిరెడ్డి ఎవరు..? ఏ ప్రాంతానికి చెందినవాడు..? అసలు ఈయన గురించి లోకం ఎందుకింతలా చర్చించుకుంటోంది..? అంత గొప్ప పనులు ఈయనేం చేశాడు..? వందల మంది కలిసి ఈ ఒకే ఒక్కడ్ని ఎందుకు చంపారు..? అసలు ఈయన్ను చంపిందెవరు..? అనే ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఔత్సాహికులు వేచి చూస్తున్నారు. అయితే ఆ సందర్భం ‘జార్జిరెడ్డి’ జీవితాన్ని బయోపిక్ తెలుసుకునే అవకాశం రానే వచ్చింది.
నాటి విద్యార్థి నాయకుడు ‘జార్జిరెడ్డి’ జీవితకథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్-22న విడుదల కానుంది. అయితే సినిమా ఏ మాత్రం రిలీజ్ అవుతుందో..? ఏ మేరకు థియేటర్లకు జనాలను రప్పించుకుంటుందో అటుంచితే రిలీజ్‌కు ముందే లేని పోని వివాదాల్లో చిక్కుకుంది. ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కలా ఈ రియల్ జార్జిరెడ్డి గురించి చెబుతున్నారు. అయితే తాజాగా.. జార్జిరెడ్డి ఆప్త మిత్రుడు, అత్యంత సన్నిహితుడు, ప్రాణ స్నేహితుడిగా ఉన్న టాలీవుడ్ డైరెక్టర్ కమ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కింది ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తమ్మారెడ్డి మాటల్లోనే...
‘హత్య జరగడానికి ముందు మధ్యాహ్నం నేను జార్జిరెడ్డి ఇద్దరం 1:30గంటల వరకు కలిసే ఉన్నాం. లైబ్రరీ దగ్గర జార్జిరెడ్డి ఉండగా.. నాకు ఆకలేస్తోంది.. భోజనం చేద్దాం రారా అంటే నేను తినను నువ్ వెళ్లు అన్నాడు. లైబ్రరీ మే చోడ్ దే (లైబ్రరీలో విడిచిపెట్టి వచ్చాను). ఆ తర్వాత నేను భోజనానికి వెళ్లిపోయాను. భోజనం చేసిన తర్వాత బోరు కొడుతుంటే నేను ఉంటున్న నారాయణగూడ నుంచి తిరిగి వెళ్తున్నాను. ఇంతలో నన్ను హాస్టల్ పిల్లలు ఆపి.. అన్నా జార్జిని పొడిచి చంపేశారు.. నువ్వు పోకు అని చెప్పారు. అయితే జార్జిరెడ్డిని పొడిచేసిన ప్రదేశం వద్దకు నేను వెళ్లేటైమ్‌కే ఆయన డెడ్ బాడీని అక్కడ్నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే జార్జిరెడ్డిని ఎవరు చంపారనేది ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉంది. అన్యాయాన్ని ఎదిరించిన వ్యక్తి జార్జి. ఎంతో మందికి స్పూర్తినిచ్చిన నాయకుడు. అలాంటి వ్యక్తిపై తెరకెక్కిన సినిమాని సినిమాగానే చూడాలి’ అని తమ్మారెడ్డి ఒకింత భావోద్వేగానికి లోనై వివరాలు వెల్లడించారు.