టాలీవుడ్‌లో పేరుగాంచిన రామానాయుడు స్టూడియో, ప్రముఖ నిర్మాత సురేష్ బాబుకు సంబంధించిన ప్రొడక్షన్స్ ఆఫీసుల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. స్టూడియో, ప్రొడక్షన్ ఆఫీసుల్లోని అకౌంట్ సెక్షన్‌లో ప్రస్తుతం ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పలు బృందాలుగా విడిపోయిన అధికారులు స్టూడియోతో పాటు మొత్తం 10 చోట్ల సోదాలు చేపట్టారు. బుధవారం ఉదయం 7గంటలకే ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఇంతవరకూ జరిగిన సోదాలపై అధికారులు ఏ మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
అయితే.. ఒకటికి రెండు సార్లు మీడియా ప్రతినిధులు ఐటీ అధికారులను ప్రశ్నించగా.. ప్రతి ఏడాదీలాగే ఈ ఏడాది కూడా సోదాలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గత కొన్నేళ్లుగా రామానాయుడు స్టూడియోకు సంబంధించి సరైన పత్రాలు దాఖలు చేయకపోవడంతో అధికారులు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం నుంచి జరుగుతున్న ఈ సోదాల్లో సురేష్ బాబు కార్యాలయాల్లోని కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మరోవైపు.. ఆర్థిక లావాదేవీల గురించి సురేష్ బాబును ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సురేశ్ ప్రొడక్షన్స్ లో ఈ మధ్య కాలంలో తెరకెక్కిన సినిమాల ఐటీ రిటర్న్స్ చెల్లించారా..? లేదా..? అనే వివరాలు కూడా ఐటీ అధికారులు సేకరిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సురేశ్ బాబుకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. అయితే.. నాలుగు ప్రత్యేక బృందాలు సురేశ్ బాబు ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సోదాలకు సంబంధించి ఇంతవరకూ సురేశ్ బాబు కానీ.. ఐటీ అధికారులు కానీ రియాక్ట్ అవ్వలేదు. కాగా.. ఇవాళ సాయంత్రం వరకూ సోదాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సురేశ్ బాబుపై ఐటీ దాడులు జరగటంతో మరికొంతమంది నిర్మాతలపై కూడా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని జంకుతున్నారు.