‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో ‘జార్జి రెడ్డి’ బయోపిక్ తెరకెక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా.. విద్యార్థుల తరఫున పోరాడిన నాయకుడిగా ‘జార్జి రెడ్డి’ కి యూత్ మనసులో స్థానం సంపాదించుకున్నారు. ఇలాంటి కథను తెరకెక్కించాలని భావించి.. ధైర్యం చేసి మరీ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించి తెరకెక్కించారు. ఇప్పటికీ చిత్రానికి సంబంధించి అన్ని పనులు అయిపోగా.. నవంబర్ 22న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తామని దర్శకనిర్మాతలు డేట్ ఫిక్స్ చేశారు. అయితే రెండ్రోజుల్లో సినిమా రిలీజ్ ఉండగా అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. అంతేకాదు సినిమా రిలీజ్ అవుతుందా కాదా..? అనేది కూడా సందేహమే.
వాస్తవానికి సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి ఎలాంటి వివాదమూ లేదు. రేపో మాపో రిలీజ్ అవుతున్న టైమ్‌లో అన్నీ వివాదాలే. ఓ వైపు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడం.. మరోవైపు ఏబీవీపీ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించడం.. ఇవన్నీ అటుంచితే అప్పట్లో ఈ రియల్ జార్జిరెడ్డి హయాంలో ఉన్న కొందరు ఆయన అనుకూలస్థులు, వ్యతిరేకులు గలం విప్పుతుండటంతో వివాదం మరింత ముదరింది. ఈ క్రమంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. చిత్ర యూనిట్‌పై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన.. దర్శకనిర్మాతలకు ఒకింత పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుంది!
‘ఈ చిత్రం ప్రోమోలో వన్ సైడ్‌గా చూపించారు. వాస్తవం ఏంటో చూపిస్తేనే ప్రజల నుంచి స్పందన వస్తుంది. సినిమా ముసుగులో ఏబీవీపీని కించపరిస్తే సహించేది లేదు. సినిమా వన్ సైడ్ మాత్రం కచ్చితంగా అడ్డుకుంటాం. జార్జిరెడ్డి హత్య సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుంది. జార్జిరెడ్డిని ఏబీవీపీకి చెందిన వ్యక్తులు హత్య చేశారన్నట్టుగా సినిమాలో చూపిస్తున్నారు. నిజానిజాలు చూపిస్తే ఎవరికీ అభ్యంతరాలు ఉండవ్. అయితే వాస్తవాలు చూపించకపోతే మాత్రం పరిస్థితి అబద్ధాలు కనుక చూపిస్తే మా నుంచి 100కు వంద శాతం స్ట్రాంగ్ రియాక్షన్ ఉంటుంది.. ఇందులో ఎలాంటి సందేహాల్లేవ్. అయినా ఇలాంటి సినిమాలకు సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్ ఇస్తోందో తనకు అర్థం కావడం లేదు. ఈ సినిమాలో కొన్ని షాట్లను కట్ చేయాలి. వాస్తవాలు చూపించాలని కోరుతున్నా.. అలా కాని పక్షంలో ఇక వాళ్ల ఇష్టం అంతే’ అని దర్శకనిర్మాతలకు రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చారు. మరి సినిమా ఎలా ఉందో ఏంటో.. రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే మరో రెండ్రోజులు వేచి చూడాల్సిందే మరి.