వివాదాలే నా ఊపిరి.. సర్వసం అంటూ సినిమాలు తీస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటికే పలు వివాదాస్పద చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ఓ ముద్ర వేయించుకున్న ఆర్జీవీ ఇటీవల ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’తో కలకలం రేపాడు. ఇప్పుడు ఈ వివాదం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమైంది. అయితే ఇది సద్దుమణుగక ముందే మరో సంచలనానికి ఆర్జీవీ తెరలేపాడు. అంతేకాదండోయ్.. అదేదో సామెత ఉంది ఆలూ లేదు.... పేరు సోమలింగం అన్నట్లుగా కమ్మరాజ్యంపై సినిమా షూటింగ్ పూర్తవ్వనే లేదు.. ఒక వేళ పూర్తయినా రిలీజ్ అవుతుందో లేదో అస్సలు తెలియదు కానీ మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ సంచలన ప్రకటన చేశాడు.
వంగవీటి సినిమా హీరో సందీప్ మాధవ్‌తో మరో సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పటి వరకూ విజయవాడ, కడప ఇలా అన్ని ఊర్లు తిరిగొచ్చిన ఆర్జీవీ మళ్లీ హైదరాబాద్ పడ్డాడు. హైదరాబాద్‌పై సినిమా తీస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘జార్జ్ రెడ్డి సినిమాలో టైటిల్ రోల్‌లో నటిస్తున్న సందీప్ మాధవ్‌ను నా నెక్ట్స్ సినిమా కోసం తీసుకుంటున్నాను. విజయవాడ రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టుల కథలను తెరకెక్కించిన తరువాత త్వరలో 80లలో హైదరాబాద్‌లోని దాదాల నేపథ్యంలో ఓ సినిమాను రూపొందిస్తున్నాను. శివ సినిమాకు నాకు ప్రేరణ ఇచ్చిన ఓ నిజజీవిత పాత్ర ఇన్సిపిరేషన్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను’ అని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ ప్రకటించాడు.
ఇదివరకే ‘వంగవీటి’ సినిమాలో రంగా పాత్రలో నటించమంటే జీవించేసిన సందీప్‌కు ఆర్జీవీ తాజాగా.. అంటే సందీప్‌కు ఆర్జీవీ మరో బంపరాఫర్ ఇచ్చారన్న మాట. ఇదిలా ఉంటే.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలకు ఊపిరి పోసిన స్టూడెంట్ లీడర్ ‘జార్జ్ రెడ్డి’ పేరుతో సినిమా వస్తోంది. ఈ సినిమాను ఆర్జీవీ శిష్యుడైన జీవన్ రెడ్డి తెరకెక్కించడంతో ఈ సినిమాకు ఫ్రీ ప్రమోషన్స్‌ను ఆయన షురూ చేశాడు. కాగా జార్జ్‌రెడ్డి నవంబర్-22న థియేటర్లలోకి రానున్నాడు.