టైటిల్ చూడగానే ఇదేంటి కాస్త వెరైటీగా ఉందని ఆలోచిస్తున్నారేమో.. అవునండోయ్.. మీరు అనుకున్నది నిజమే. ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరించే వైసీపీ ఎమ్మెల్యే రోజా శెల్వమణి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక జబర్దస్త్ షోలు వద్దు.. జనమే ముద్దని.. నియోజకవర్గ సమస్యలు, సీఎం వైఎస్ జగన్ తనకిచ్చిన పదవీ బాధ్యతలపై ఆమె దృష్టి సారించారు. షోలు అంటూ అస్తమాను హైదరాబాద్‌కు వచ్చి పోతుండటంతో నియోజకవర్గ ప్రజలతో లాంగ్ గ్యాప్ వచ్చేస్తుందని.. ఈ ఎఫెక్ట్ రానున్న ఎన్నికల్లో గట్టిగా పడే అవకాశముందని ముందు జాగ్రత్తగా రోజా ఈ నిర్ణయం తీసుకున్నారు.
అందుకే ఇకపై ఓన్లీ.. నగరిపైనే ఫుల్ ఫోకస్ పెట్టాలని భావించి పలు కార్యక్రమాలకు రోజా శ్రీకారం చుట్టారు. అంతేకాదు.. ఈ క్రమంలోనే ఇంతవరకూ ఏపీలో ఏ నాయకుడు చేపట్టన ప్లాస్టిక్‌పై రోజా సమరశంఖం పూరించారు!. కేజీ ప్లాస్టిక్ పట్టుకొస్తే.. కిలో బియ్యం ఫ్రీ అంటూ నయా కార్యక్రమానికి చేపట్టారు. ఈ కార్యక్రమంపై జనాల్లో ఆమె చైతన్యం తెచ్చేందుకు గాను నియోజకవర్గంలో వాడావాడా తిరుగుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోజాతో పాటు జడ్జ్‌గా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు కూడా షోకు టాటా చెప్పేసి.. మరో కొత్త చానెల్‌లో చేరిపోయిన విషయం విదితమే.
ఇదిలా ఉంటే.. జగన్ చీవాట్లు పెట్టడంతోనే రోజా ఇలా మారిపోయారని మరోవైపు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు రోజాకు అక్షింతలు వేసినప్పటికీ తీరు మార్చుకొని తాజాగా గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో హైదరాబాద్ నుంచి నగరి బాట పట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చూస్తే.. ‘మార్పు మంచిదే.. నేనూ మార్గదర్శిలో చేరుతున్నాను’ అన్నట్లుగా రోజా మొత్తానికి జబర్దస్త్ షోకు టాటా చెప్పేసిందన్న మాట. మరి ఇంతటితో బుల్లితెర, వెండితెరకు పూర్తిగా ఫుల్‌స్టాప్ పెట్టేసినట్లేనా.. లేకుంటే అప్పుడప్పుడు అలా వచ్చి మెరుపుతీగలాగా మెరిసిపోతుందో వేచి చూడాలి మరి.