‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో ‘జార్జి రెడ్డి’ బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిగా .. విద్యార్థుల తరఫున పోరాడిన నాయకుడిగా ‘జార్జి రెడ్డి’ కి యూత్ మనసులో స్థానం సంపాదించుకున్నారు. అయితే విధి ఆడిన వింతనాటకంలో 25 ఏళ్ల వయసులోనే ఆయన ప్రత్యర్థుల చేతిలో కన్నుమూశాడు. ఇలాంటి కథను తెరకెక్కించాలని భావించి.. ధైర్యం చేసి మరీ జీవన్ రెడ్డి దర్శకత్వం వహించి తెరకెక్కించారు. ఇప్పటికీ చిత్రానికి సంబంధించి అన్ని పనులు అయిపోగా.. నవంబర్ 22న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తామని దర్శకనిర్మాతలు డేట్ ఫిక్స్ చేశారు. ఇంతవరకూ అంతా ఓకే గానీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పోలీసులు అనుమతి నిరాకరించడంతో చిత్ర యూనిట్‌కు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది. అయితే తాజాగా కలలో కూడా ఊహించని షాక్ తగిలింది.
జార్జిరెడ్డి సినిమా ఆగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సినిమాను రిలీజ్ చేయొద్దంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్తు(ఏబీవీపీ) పట్టుబట్టింది. సినిమాపై ఏబీవీపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకూడదని.. నిషేధించి తీరాల్సిందేనని ఏబీవీపీ నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా ఏబీవీపీ చెబుతోంది.. ‘వందల మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వ్యక్తి జార్జిరెడ్డి. సినిమాలో ఏబీవీపీని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయి. ఆ చిత్రాన్ని అడ్డుకుంటాం. నిజానిజాలను సెన్సార్ బోర్డు పరిశీలించాలి’ అని ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర సెక్రటరీ శ్రీశైలం డిమాండ్ చేశారు.
కాగా ఇంతవరకూ ‘జార్జి రెడ్డి’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రాలేదు. ఈ సర్టిఫికెట్ కోసం దర్శకనిర్మాతలు తపస్సు చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు సినిమా ఆపేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ఈ తరుణంలో సినిమా రిలీజ్ అవుతుందా..? లేదా..? అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. మరి పరిస్థితి ఎలా ఉంటుందో జస్ట్ వెయిడ్ అండ్ సీ..!