అరవిందస్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రలలో.... సీనియర్ నటి మీనా కుమార్తె బేబీ నైనిక ఓ ముఖ్య పాత్రలో సిద్ధికీ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన భాస్కర్ ఓరు రాస్కెల్ ఇప్పుడు తెలుగులో భాస్కర్ ఒక రాస్కెల్ పేరుతో రాబోతోంది. కార్తికేయ మూవీస్ పతాకంపై నిర్మాత పఠాన్ చాన్ బాషా అందిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరులో విడుదల కానుంది. కాగా ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన వి.సముద్ర, కె.యల్.దామోదరప్రసాద్ (దాము)లు టీజర్ ను విడుదల చేసారు.
ఈ సందర్బంగా వి.సముద్ర మాట్లాడుతూ... తమిళ, మలయాళ భాషల సినీ రంగాలలో బాగా పేరున్న సిద్దికీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ రెండు భాషలలో వేరు వేరుగా సిద్దికీ తీసిన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సాధించింది. యాక్షన్, సెంటిమెంట్ వంటి అన్ని అంశాలను మిళితం చేసి చక్కటి కుటుంబ కధాంశంతో దీనిని మలిచారు అని చెప్పారు. కె.యల్. దామోదర ప్రసాద్ మాట్లాడుతూ... మంచి సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు, ఆ కోవలో కుటుంబ కధా నేపథ్యంలో తీసిన ఈ సినిమా తప్పకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. నూతన నిర్మాతలకు చిత్ర నిర్మాణం పట్ల అవగాహన కల్పించడం కోసం నిర్మాతల మండలి తరపున క్లాసులు నిర్వహిస్తున్నాం. దీనిని నూతన నిర్మాతలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఇంకో అతిధి లగడపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ... మంచి అభిరుచితో పఠాన్ చాన్ బాషా ఈ రంగంలోనికి వచ్చారని పేర్కొనగా... మంచి కధా బలమే సినిమాకు ప్రాణమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సెన్సార్ బోర్డు సభ్యుడు వేణుగోపాల్ యాదవ్ అన్నారు.
చిత్ర నిర్మాత పఠాన్ చాన్ బాషా మాట్లాడుతూ... తోడు లేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు. వారు అలా కలిసేందుకు ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేసారు అన్న ఆసక్తి దాయకమైన ఇతివృత్తంతో ఆద్యంతం హాస్య ప్రధానంగా ఈ చిత్రం రూపొందింది అన్నారు. ఇందులోని ఊహించని ఓ ట్విస్ట్ ప్రేక్షకులను ఎంతగానో అలరింప చేస్తుందని చెప్పారు. అరవిందస్వామి, అమలాపాల్ తమ పాత్రలలో అద్భుతమైన నటనను కనబరిచారని, అమ్రిష్ గణేష్ సమకూర్చిన సంగీతం ఆకట్టుకుంటుందని చెప్పారు. నవంబర్ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రలలో నాజర్, నికీషా పటేల్, రోబో శంకర్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి నిర్మాత: పఠాన్ చాన్ బాషా. దర్శకత్వం: సిద్ధికీ