కొత్తదనం ఎవరు కోరుకోరు.. అన్నట్లుగా ఒకప్పటి మూసధోరణిలాగా కాకుండా దర్శకుడు తేజ చాలా డిఫరెంట్‌గా అడుగులేస్తూ సినిమాలు చిత్రీకరిస్తుంటాడు. ఇప్పటికే లవ్ ట్రాక్ మొదలుకుని పొలిటికల్ వరకు అన్ని రకాల కథలను ఆయన టచ్ చేశారు. అయితే.. తాజాగా మరో వివాదాస్పద విషయాన్ని తెరెకెక్కించేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ కథ మరేదో కాదు.. ‘ఆర్టికల్ 370’ అని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఇలాంటి వివాదాస్పద కథలు టచ్ చేయడానికి తెలుగు డైరెక్టర్స్ దాదాపుగా సాహసించరు. కానీ వెరైటీ కథలను ఎంచుకుంటూ ట్రెండ్ సెట్ చేయడానికి ముందుండే తేజ మాత్రం ఈ సాహసం చేస్తున్నాడు.
ఈ మధ్య తేజ చేస్తున్న సాహసాలేమీ వర్కవుట్ కాలేదు. మొన్నటికి మొన్న ‘సీత’ ఊహించని విధంగా ప్లాప్ అవ్వడంతో ఆ తర్వాత తదుపరి ప్రాజెక్ట్‌ను ఆయన ప్రకటించలేదు. అయితే కాస్త లేటైనా పర్లేదు కానీ మంచి హిట్ కథతో ముందుకు రావాలని భావించి ఫైనల్‌గా ‘ఆర్టికల్ 370’ పూర్వ పరాలు అన్నీ సిద్ధం చేసుకుని కథ రాసుకున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశముందట. ఒక్క తెలుగులోనే కాదు రెండు మూడు భాషల్లో తెరకెక్కించాలని తేజ భావిస్తున్నాడట. ఇప్పటి వరకూ వివాదాస్పద చిత్రాల జోలికి పోని తేజ.. ఫస్ట్ టైమ్ అటుగా అడుగులేస్తున్నాడన్న మాట. మరి ఇందులో నిజానిజాలెంతున్నాయో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడేంతవరకు వేచి చూడాల్సిందే మరి. ఒక్క మాటలో చెప్పాలంటే తేజ్ డేరింగ్ స్టెప్ వేస్తున్నాడన్న మాట.
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్‌కు వర్తించవు. అయితే.. ఈ ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో ఆగస్టు 5న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే.