బిగ్ బాస్ సీజన్ 1 అదుర్స్, సీజన్ 2 యావరేజ్, సీజన్ 3 ఓకే ఓకే అన్నారు. నిజంగానే నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ 3 మొదట్లో పర్వాలేదనిపించినా .. మధ్యలో బాగా డల్ అయ్యింది. రేటింగ్ పెంచుకోవడానికి స్టార్ మా నానా తిప్పలూ పడింది. కానీ వర్కవుట్ అవ్వలేదు. బిగ్ బాస్ లీకులతో స్టార్ మా యాజమాన్యం తలలు పట్టుకుంది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌ని ఎంతగా దాచినా.. సోషల్ మీడియా వాసన చూసి లీకులు వదలడంతో.. సీజన్ 3 కాస్త నెమ్మదించింది. ఇలా అయితే పనిజరగదని.. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్‌కి మెగాస్టార్ చిరుని అతిధిగా పిలిచారు. కానీ చిరంజీవి ఫైనల్ ఎపిసోడ్‌లో లాస్ట్ వన్ అవర్ మాత్రమే గెస్ట్‌గా సందడి చేసాడు.
అయితే నాగార్జున హోస్టింగ్, హాట్ హీరోయిన్స్ డాన్స్ లు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హడావుడితో స్టార్ మా కి సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ లో సూపర్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు 18.29 రేటింగ్ వచ్చింది. అయితే ఇది కేవలం నాగ్, హీరోయిన్స్ పెరఫార్మెన్స్ కి మాత్రమే. ఆ తర్వాత చివరి గంటలో చిరు బుల్లితెర మీద చేసిన కామెడీకి ఈ టీఆర్పీ రేటింగ్ దూసుకుపోయింది. బిగ్ బాస్ చివరి ఎపిసోడ్ చివరి గంటకు ఏకంగా 22.4 రేటింగ్ వచ్చింది.. అంటే చిరంజీవి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా మెస్మరైజ్ చేసారో ఆ ఎపిసోడ్ రోజునే మాట్లాడుకున్నాం.
చిరంజీవి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో మాట్లాడిన తీరు, ఆయన హావభావాలు, మ్యానరిజం, కామెడీ అన్ని అందరిని ఆకట్టుకున్నాయి. ముందే అనుకున్నట్టే ఈ ఫైనల్ ఎపిసోడ్ రేటింగ్స్ లో దూసుకుపోవడం ఖాయమని.... అనుకున్నదే నిజమైంది. బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్, బిగ్ బాస్ 1 ని 2 ని కూడా క్రాస్ చేసి చూపించింది. మరి మొదట్లో మందగించిన రేటింగ్.. చివరిలో చిరు పుణ్యమా అని దుమ్ముదులిపింది.