టాలీవుడ్ సూపర్‌స్టార మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా హిట్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చేసింది. 2020 సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి ఇంతవరకూ సరైన ప్రమోషన్ చేసిన దాఖలాల్లేవ్. అప్పుడప్పుడు సింగిల్ అంటూ చిన్నపాటి లుక్స్ తప్ప చిత్రబృందం చేసిందేమీ లేదు. అయితే ఇదే 2020 సంక్రాంతికి విడుదలకానున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ‘అల వైకుంఠంపురములో..’ మాత్రం ప్రమోషన్స్‌లో అందనంత వేగంతో వడివడిగా దూసుకెళ్తోంది. అసలు సరిలేరు కోసం ఎందుకు ఇలా ప్రమోషన్స్ చేయలేదు..? అసలు అనీల్ మనసులో ఏముంది..? దర్శకనిర్మాతలు ఎందుకింత నెగ్లెక్ట్ చేస్తున్నారు..? వీళ్లందరూ విషయం పక్కనెడితే కనీసం మహేశ్ అయినా షురూ చేయొచ్చు కదా అని ఆయన అభిమానులు బయటికి చెప్పుకోలేక... మనసులో పెట్టుకోలేక మిన్నకుండిపోతున్నారు.
ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో దాన్నే ఇలా సినిమాకు వాడుకొని సక్సెస్ కావాలని ‘సరిలేరు..’ దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. అందుకే సినిమా కోసం ప్రచారం చేయడానికి ఔత్సాహిక ప్రచారకర్తలు కావాలి అనే ప్రకటన వచ్చింది. ఈ ప్రకటన కూడా ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ఓ ట్వీట్ చేసి తీసేసినట్లు సమాచారం. వాస్తవానికి ఇప్పటి వరకూ ప్రెస్ మీట్‌లు, ప్రీ రిలీజ్‌లు.. సక్సెస్ మీట్‌లు, ఇంటర్వ్యూలు ఉండేవి.. అంటే ఇకపై ఇవన్నీ ఏమీ వద్దనుకొని ‘సరిలేరు మాకెవ్వరు’ అన్నట్లుగా గట్టిగానే చిత్రబృందం ప్లాన్ చేస్తోందన్న మాట.
ప్రమోషన్స్‌కు, పబ్లిక్‌తో రిలేషన్స్‌కు పలు సంస్థలున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ కంటెంట్‌ను మాత్రమే అందిస్తాయి. అంతేకాదు ఎవరి డబ్బా వాడు కొట్టుకోవాలన్నట్లుగా.. పబ్లిసిటీ సంగతులన్నీ నిర్మాతలు చూసుకునేవారు. ఇకపై ఔత్సాహికులు కూడా వచ్చి చేయి కలుపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉంటుందో.. అసలు ఇందులో నిజానిజాలెంతో..? సరిలేరుతో చేస్తున్న ఈ ఔత్సాహికుల ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు వేచిచూడాల్సిందే.