టైటిల్ చూడగానే ఇదేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? అవునండోయ్ బాబూ.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే. 2019 ఎన్నికల్లో కనివీనీ ఎరుగని రీతిలో అసెంబ్లీ స్థానాలు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి స్థానంలో.. స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరి మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న చిరంజీవి వచ్చేస్తున్నారు. కొంపదీసి ఇదేం సినిమా కాదు కదా..? అని అనుకుంటున్నారేమో..? అస్సలు కానే కాదండోయ్. అసలు కథేంటో తెలుసుకోవాలని ఉంది కదూ.. ఇంకెందుకు ఆలస్యం చకచకా ఈ స్టోరీ చదివేయండి మరీ..
సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ‘ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్’ ఒక్కటన్న విషయం తెలిసిందే. ఏఎన్నార్ అవార్డ్స్ 2006 నుంచి మొదలైంది. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో జీవితకాల విజయాలు, పరిశ్రమకు వారు చేసిన కృషికి గాను అవార్డులు ఇస్తూ వస్తున్నారు. అయితే 2018 ఏడాదికి గాను.. అతిలోక సుందరి శ్రీదేవిని.. 2019 ఏడాదికి గాను అందాల తార రేఖను ఈ అవార్డులు వరించాయి. ఈ మహోన్నత కార్యక్రమం నవంబర్-17న అన్నపూర్ణ స్టూడియో వేదికగా జరగనుంది.
ఈ అవార్డుల ప్రదానం మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా జరగనుంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు వెల్లడిస్తుండగా... విలేఖరుల నుంచి నాగార్జునకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డుల వేడుకకు సీఎం జగన్ వస్తారా..? అనే ప్రశ్నకు నాగ్ ఈ విధంగా జవాబిచ్చారు. ‘జగన్ గారు రావట్లేదు.. ఆయన స్థానంలో మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు’ అని మన్మథుడు బదులిచ్చారు. అంటే జగన్ రావాల్సిన స్థానం చిరంజీవికి దక్కిందన్న మాట. ఇదిలా ఉంటే.. ఈ అవార్డ్స్ శ్రీదేవి భువి మీద లేకుండా తిరిగిరానిలోకాలకు చేరుకోవడంతో ఆమె స్థానంలో భోనీ కపూర్, జాన్వీలు తీసుకోనున్నారు. మరోవైపు రేఖ ఈ కార్యక్రమానికి విచ్చేసి మెగాస్టార్ చిరు చేతుల మీదుగా అవార్డ్ అందుకోనుంది.