‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6న ‘మిస్ మ్యాచ్’ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్‌లు మీడియాకు అధికారికంగా ప్రకటించారు.
ఇటీవల ప్రముఖ దర్శకుడు ‘క్రిష్’ చేతుల మీదుగా విడుదలైన ‘మిస్ మ్యాచ్’ తొలి ప్రచార చిత్రాలు, విక్టరీ వెంకటేష్ విడుదల చేసిన చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ వారికి మరోసారి కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘మిస్ మ్యాచ్ చిత్ర కథను భూపతిరాజాగారు ఇచ్చారు. మంచి కథలు వింటున్న సమయంలో ఈ కథ నాకు రావడం అదృష్టం. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం సినిమాకు ప్లస్. ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ ఐశ్వర్య రాజేష్ పక్కన నేను నటించడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. చిత్ర కథ, కథనాలు ప్రేక్షకులను అలరిస్తాయి. డిసెంబర్ 6న చిత్రం విడుదల అవుతోంది. మీ ఆశీస్సులు కావాలి అన్నారు. సహకరిస్తున్న మీడియాకు కృతఙ్ఞతలు’’ అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. ‘‘ఒకమంచి కథ మిస్ చేసుకోకూడదని ఈ సినిమా చేసాను. భూపతిరాజాగారి కథ చాలా బాగుంది. దర్శకుడు కథను అందంగా తెరమీద చూపించారు. నా పాత్ర ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. గణేష్ సినిమాటోగ్రఫీ బాగుంది’’ అన్నారు.
రచయిత భూపతిరాజా మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా రెండు కుటుంభాల మధ్య జరిగే కథ. హీరో హీరోయిన్‌లు పోటీ పడి నటించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు, దర్శకుడు ఎన్.వి.నిర్మల్‌కు ధన్యవాదాలు. ఈ చిత్రం మిమ్మల్ని ఆలరిస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు.
దర్శకుడు ఎన్.వి. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో హీరో హీరోయిన్‌ల పాత్రలు కొత్తగా ఉంటాయి. సరికొత్త కథ,కథనాలతో దర్శకుడిగా తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది. చిత్ర నిర్మాణంలో నిర్మాతలు జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్ నాకు బాగా సహకరించారు. మీ అందరికి ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
నిర్మాతలు జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్‌లు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించారు. హీరోయిన్ క్రీడా నేపథ్యం కలిగి ఉన్న పాత్రలో, ఛాలెంజింగ్ రోల్‌లో నటించింది. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం, నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఆడియన్స్ కోరుకుంటున్న అన్ని అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు..’’ అని తెలిపారు.
ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కథ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం, దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్, నిర్మాతలు: జి. శ్రీరామ్ రాజు, భరత్ రామ్.