స్టార్ హీరోయిన్ ఏంటి..? వరుణ్ సరసన నటించి రొమాన్స్ పండించకుండా.. తల్లిగా నటిస్తోందని ఆశ్చర్యపోతున్నారా..? అవును మీరు వింటున్నది నిజమే కానీ చిన్న కరెక్షన్ అంతే.. అలనాటి స్టార్ హీరోయినే గానీ.. ఇప్పటి హీరోయిన్ కాదు. అసలు ఆ స్టార్ హీరోయిన్ ఎవరు..? వరుణ్ తల్లిగా నటించడానికి ఎలా ఒప్పుకుంది..? ఎవరు సంప్రదించారనే వార్తలు ఈ కథనంలో తెలుసుకుందాం. వైవిధ్యమైన కథా చిత్రాలకు ప్రాధాన్యం ఇస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న హీరో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ ఏడాదే రెండు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న వరుణ్.. తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమాలో బాక్సర్‌గా వరుణ్ తేజ్ కనిపించనున్నాడు. ప్రస్తుతం ముంబైలో వరుణ్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు.
అయితే చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు బయటికి రాలేదు కానీ.. పుకార్లు మాత్రం గట్టిగానే వస్తున్నాయి. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు రూమర్స్ బయటికి రాగా.. తాజాగా ఈ సినిమాలో వరుణ్‌కు తండ్రిగా ఎవరు నటిస్తున్నారు..? తల్లిగా ఎవరు నటిస్తున్నారు...? అనే ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రెండ్రోజుల క్రితం నుంచి వరుణ్ తండ్రిగా స్టార్ సీనియర్ యాక్టర్ మాధవన్ నటిస్తున్నాడని వార్తలు వినవస్తున్నాయి. అయితే ఈయన ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తుండగా తండ్రి పాత్రలో నటించడానికి ఎలా ఒప్పుకున్నారా..? అనేది ఇప్పుడు అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ తాజాగా మరో కొత్త పుకారు పుట్టుకొచ్చింది.
వరుణ్ తల్లిగా సీనియర్ నటి.. అప్పట్లో టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను ఏలిన రమ్యకృష్ణ నటిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే రమ్యను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే సురేందర్ రెడ్డి సినిమాకోసం ఈమెను అడుగుతున్నారా? లేదంటే కిరణ్ కొర్రపాటి సినిమా కోసం అడుగుతున్నారా? అనేది తెలియరాలేదు. అయితే ప్రస్తుతం హడావుడి అంతా వరుణ్ సినిమాకేనని సమాచారం. మరోవైపు అబ్బే అదేం లేదు.. రమ్యకృష్ణ ఒప్పుకుంది.. నటించడానికి రెడీ అని చెప్పేసిందట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.