1965 నుంచి 1975 కాలంలో హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ.. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన స్టూడెంట్ లీడర్ ‘జార్జ్ రెడ్డి’. ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని బయోపిక్ రూపొందుతోంది. ఈ సినిమాలో ‘వంగవీటి’ ఫేమ్ సందీప్ మాధవ్ లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ‘దళం’ మూవీ ఫేం జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. మైక్ మైవీస్ అధినేత అప్పిరెడ్డి, సిల్లీ మంక్స్, త్రీ లైన్స్ సినిమా బ్యానర్లతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. నవంబర్ 22న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మంచి మార్కులేశారు. మరోవైపు ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి వ్యూస్ సంపాదించుకుంది.
తాజాగా.. సినిమా ట్రైలర్ చూసిన సీనియర్ నటుడు నాగబాబు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘మై చానెల్ నా ఇష్టం..’ యూ ట్యూబ్ చానెల్ ద్వారా నాగబాబు రియాక్ట్ అవుతూ.. చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సినిమా తన తమ్ముడు పవన్ కల్యాణ్ లేదా కుమారుడు వరుణ్‌తేజ్‌ను హీరోగా పెట్టి తీద్దామని భావించానన్నారు. అయితే ముందుగానే జీవన్ రెడ్డి తెరకెక్కించడం చాలా ఆనందమన్నారు. ట్రైలర్‌ను పూర్తిగా చూసిన తర్వాత ఈ పాత్రకు ఎంత పెద్ద నటుడైనా సరిపోడని అనిపించిందన్నారు. అంతటితో ఆగని ఆయన.. జార్జి రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. ఆయన మేధావి మాత్రమే కాదు.. రియల్ హీరో.. రియల్ లైఫ్ బాక్సర్.. అనేక విద్యల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తని నాగబాబు ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సందర్భంగా తన మనసులోని మాటను నాగబాబు బయటపెట్టారు. ‘జార్జిరెడ్డి ఫొటోలను చూస్తుంటే మా పవనే గుర్తుకొస్తాడు. ఆయన వ్యక్తిత్వం, భావోద్వేగాలు పవన్‌లో కనిపిస్తాయి. జార్జిరెడ్డి జెండాలో పిడికిలి గుర్తు.. జనసేన జెండాలో ఉండటం యాదృచ్ఛికం. ఇప్పటివరకు చాలా బయోపిక్‌లు వచ్చాయి. అసలు బయోపిక్ అంటే ఇదీ’ అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 17న ‘జార్జ్ రెడ్డి’ ప్రి రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్‌కు పవన్ కల్యాణ్ అతిథిగా హాజరవుతారని వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.