టాలీవుడ్ సీనియర్ నటుడు విజయ్ చందర్ వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించిన నాటి నుంచి వైసీపీకి సేవలు అందించిన ఆయనకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కీలక బాధ్యతలు కట్టబెట్టారు. ఆంధ్రప్రదేశ్ టీవీ అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా విజయ్ చందర్‌ను నియమిస్తూ జగన్ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం నాడు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ కార్పొరేషన్‌కు అంబికా కృష్ణ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్దిరోజులకే అంబికా తన పదవికి రాజీనామా చేసి టీడీపీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఈ పదవి కోసం సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుతో పాటు చాలా మంది కర్చీప్‌లు వేశారు.! మరోవైపు వైసీపీలో కీలకంగా ఉండే ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ల దగ్గర సీనియర్ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ, కమెడియన్ అలీతో పాటు పలువురు అప్లికేషన్స్ కూడా పెట్టుకున్నారు.!
అయితే మోహన్‌బాబునే ఈ పదవి వరిస్తుందని అందరూ భావించారు. అయితే ఆయన నిన్నగాక మొన్న పార్టీలో చేరడం.. విజయ్ చందర్ జమానా నుంచే వైసీపీకి సేవలందిస్తుండటంతో చివరికి ఆయన్నే వైఎస్ జగన్ ఫిక్స్ చేసి అధికారిక ప్రకటన చేసేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు కావడం కూడా ఓ అర్హతేనని తెలుస్తోంది. భక్తి సినిమాల్లో ఎక్కువగా నటించిన విజయ్ చందర్.. కరుణామయుడు చిత్రంలో క్రీస్తుగా, శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యంలో సాయిబాబాగా నటించి తెలుగు ప్రేక్షకుల్లో చెరిగిపోని ముద్రవేసుకున్నారు. అలా సినిమాల్లో నటిస్తూనే రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన.. వైఎస్ జగన్ విధేయుడిగా నిలిచారు. దీంతో విధేయుడికే ఎఫ్‌డీసీ చైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టారు. కాగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి వైసీపీకి సేవలందించిన పలువురికి వైఎస్ జగన్ కీలక పదవులిచ్చిన విషయం విదితమే.