తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘అసురన్’. దసరా కానుకగా అక్టోబర్ 4న విడుదలైన ఈ చిత్రం తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు.. ఇప్పటికే కలెక్షన్ల పరంగా రూ.100 కోట్లు దాటేసింది. ఈ సినిమాలో ధనుష్.. డబుల్ రోల్‌లో చేయగా.. ఈయన సరసన మంజువారియర్ నటించింది. ఈ సినిమా చూసిన పెద్ద పెద్ద స్టార్‌లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. దీంతో తెలుగు, బాలీవుడ్‌తో పాటు మరికొన్ని రీమేక్ హక్కుల కోసం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మొదట మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ మనసుపడ్డాడని వార్తలు రాగా.. ఆ తర్వాత సీనియర్ నటుడు వెంకటేష్ దగ్గుబాటి చేస్తున్నారని అధికారికంగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే ఇంత వరకూ అంతా ఓకేగానీ డైరెక్టర్ ఎవరు..? ఎవరైతే వెంకీకి హిట్టు.. తనకు కాసుల వర్షం కురిపిస్తారని రెండ్రోజులుగా నిశితంగా ఆలోచించిన సురేష్ బాబు ఫైనల్‌గా ఓ డైరెక్టర్‌ను ఫిక్సయ్యారట.
ఆయన మరెవరో కాదు.. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘లై’, ‘పడి పడి లేచే మనుసు’ లాంటి వాస్తవానికి దగ్గరుండే సినిమాలు తెరకెక్కించిన హను రాఘవపూడి.! ఇప్పటికే పలువురు డైరెక్టర్లను చూసిన నిర్మాత ఇక లేట్ చేయకూడదని హనును ఫిక్స్ చేసేశారట. ‘అసురన్’ సినిమా వాస్తవానికి కాస్త దగ్గరగా ఉండటంతో దీన్ని మరింతగా మలిచి.. హను అయితే తీయగలడని గట్టి నమ్మకం సురేష్‌లో ఏర్పడిందట. ఇక డైరెక్టర్ దొరికాడు.. మిగిలింది హీరోయిన్, విలన్, సాంకేతిక బృందం మాత్రమేనట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘వెంకీమామ’ రిలీజ్ తర్వాత షూటింగ్‌ను పట్టాలెక్కించాలని సురేష్ భావిస్తున్నారట. ఈ చిత్రం వెంకీ కెరీర్‌లోనే ఓ మైలురాయి కానుంది. అయితే డైరెక్టర్ వ్యవహారంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. వైవిధ్య పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్న వెంకీ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.