సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రంలో ఓ కీలకపాత్రతో అలనాటి సీనియర్ నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి అలియాస్ రాములమ్మ రీ ఎంట్రీ ఇస్తున్నారు. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత విజయశాంతి సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఈమెకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ, మహేశ్ గురించి.. అసలు మహేశ్ వ్యక్తిత్వం ఎలాంటిది..? తోటి ఆర్టిస్టులతో సూపర్‌స్టార్ ఎలా ఉంటారు..? ఇలా పలు ఆసక్తికర విషయాలను ఆమె పంచుకున్నారు.
మహేశ్ బాబు హీరోగా వస్తున్నాడని తెలిసి షాకయ్యానని చెప్పుకొచ్చారు. చిన్నప్పుడు చాలా చబ్బీగా ఉండే ఆయన హీరో అయ్యాడని.. ఫస్ట్ సినిమా చూసి కచ్చితంగా సూపర్‌స్టార్ అవుతాడని తనకు అనిపించిందని రాములమ్మ తెలిపారు. ‘ఆ రోజు అనుకున్నట్లుగానే జరిగింది. ఇప్పుడు మహేశ్ సూపర్ స్టార్‌గా ఉన్నారు. మహేశ్ తనను సెట్లో అమ్మ, మేడమ్ అని పిలుస్తుంటాడు. నేను ఆయన్ను మహేశ్ అని కాకుండా బాబు అని పిలుస్తాను’ అని విజయశాంతి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అంతటితో ఆగని రాములమ్మ.. మహేశ్ క్యారెక్టర్ గురించి చెబుతూ.. ఆకాశానికెత్తేశారు. కృష్ణ గారు సాఫ్ట్ అని.. అలాగే మహేష్ డౌన్ టు ఎర్త్ అని చెప్పారు. సీనియర్లను ఆయన ఎప్పుడూ గౌరవిస్తారని.. తండ్రిలానే ఎప్పుడూ తప్పుగా మాట్లాడరని మహేశ్‌కు మంచి మార్కులేశారు.
మహేశ్ చాలా సాఫ్ట్, హంబుల్ అని చెప్పుకొచ్చారు. మహేశ్ చాలా డిఫరెంట్‌గా ఉంటారని అనుకున్నా.. కానీ మాత్రం చాలా సరదాగా ఉంటారని.. పెద్ద వాళ్లంటే గౌరవంగా ఉంటారని రాములమ్మ తెలిపారు. అంతేకాదు ఈ సందర్భంగా మహేశ్, కృష్ణతో కలిసి తాను నటించిన సినిమాలను ఈ ఇంటర్వ్యూలో రాములమ్మ గుర్తుకుతెచ్చుకున్నారు. కాగా.. ‘సరిలేరు నీకెవ్వరు’లో రాములమ్మ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే సుమారు రెండు వారాలకు పైగా హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్శిటిలోనే విజయశాంతికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. దీంతో ఆమె ప్రొఫెసర్‌గా నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. రాములమ్మ దగ్గరే మహేశ్ చదువుకుంటాడని తెలుస్తోంది. మరి ఈ చిత్రంలో భారతీగా విజయశాంతి పాత్ర ఎలా ఉండబోతోందో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే మరి.