‘అంతా ఇష్టం.. నేను తీసిందే సినిమా.. మీకు నచ్చితే లేకుంటే సైలెంట్‌గా ఉండండి.. నేనింతే’ అంటూ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఈయన గురించి ఇంతకుమించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఆర్జీవీ సినిమా తీస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి థియేటర్లలోకి వచ్చి ఆడేంత వరకూ ప్రతిరోజూ వివాదాలే వివాదాలుంటాయ్.. ఎందుకంటే ఆ వివాదాలే సినిమా ప్రమోషన్స్ గనుక. ఇక అసలు విషయానికొస్తే ఆర్జీవీ తాజాగా ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ అనే టైటిల్‌తో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సాంగ్స్, ఫస్ట్‌లుక్, పాత్రధారులను అభిమానులు, సినీ ప్రియులకు ఆయన పరిచయం చేశారు. అయితే ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ మాత్రం సంచలనాలకు తెరలేపింది. ఈ ట్రైలర్‌లో అటు వైసీపీ.. ఇటు టీడీపీ మధ్యలో జనసేన ఇలా ఏ పార్టీని వదలకుండా అందర్నీ ఏకిపారేశారు ఆర్జీవీ. దీంతో వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు, వీరాభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతేకాదు.. మరోవైపు పలువురు రాజకీయ నేతలు, మేథావులు, రచయితలు సైతం స్పందిస్తూ ఈ ట్రైలర్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అయితే ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.. ఆర్జీవీ చిత్రంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ చానెల్ నిర్వహించిన డిబేట్‌లో భాగంగా.. దిక్కుమాలిన ఆలోచనలతో వివాదాస్పద సినిమాలు తీస్తున్నాడని.. ఆయన ఎంతో ప్రమాదకారి అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. తనకు జొన్నవిత్తుల చౌదరి అనే బిరుదు ఇచ్చాడంటూ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. అంతటితో ఆగని ఆయన.. ఆర్జీవీపై తాను సినిమా తీస్తానని చెప్పి.. ‘పప్పు వర్మ’ అని టైటిల్‌ను చెప్పారాయన. అయితే తాజాగా జొన్నవిత్తుల వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదిగా ఆర్జీవీ స్పందిస్తూ.. రాయలేని పదాలతో.. ఎమోజీలు జోడించి మరీ వ్యాఖ్యలు చేశారు.
ఆర్జీవీ అసలేమన్నారు..!?
‘ఓ నా బుజ్జి జొన్నా.. నీ వీడియో చూశాన్రా కిస్సీ బాయ్! నువ్వు అప్పుడప్పుడూ దశాబ్దానికొకసారైనా ఒక స్త్రీతో ఎంజాయ్ చెయ్యి బేబీ.. లేకపోతే ఫ్రస్ట్రేషన్‌తో చచ్చిపోతావ్ జొన్నా. నీ భార్య పిల్లలు నిన్నెలా భరిస్తున్నారు డార్లింగ్.. వాళ్ళ మీద జాలేస్తుంది స్వీట్ హార్ట్, కానీ ఐ లవ్ యు డా’ అని జొన్నవిత్తులపై ఆర్జీవీ సంచలన ట్వీట్ చేశారు. ఇందుకు పలువురు నెటిజన్లు, ఆర్జీవీ వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. జొన్నవిత్తుల ఆయన అభిప్రాయం చెప్పారు.. మీరు దానికి ‘స్త్రీ’.. దశాబ్దం అదీ ఇదీ అనే పెద్ద మాటలు మాట్లాడటమెందుకు..? ఇది ఎంతవరకు సబబు..? ఆర్జీవీ అంటూ కన్నెర్రజేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై జొన్న విత్తుల రియాక్ట్ అవుతారా..? లేకుంటే పోయి పోయి వర్మతో పెట్టుకోవడమేంటి..? అని మిన్నకుండిపోతారో వేచి చూడాల్సిందే మరి.