టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. లవ్ సినిమాలకు కేరాఫ్‌గా పేరుగాంచిన విక్టరీ.. అప్పట్లో వరుసగా అన్నీ లవ్ నేపథ్యమున్న సినిమాల్లోనే నటించి మెప్పించాడు. అంతేకాదు వెంకీ టచ్ చేయని స్టోరీ అంటూ లేదు.. దాదాపు అన్నింటినీ చేశాడు. అలా ఇప్పటికే 73 సినిమాల్లో నటించేశారు. త్వరలోనే ‘వెంకీమామ’గా విక్టరీ అభిమానుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు ఇప్పటికే తమిళ కుర్ర హీరో నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అసురన్’ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా తెలియవచ్చింది. ఈ సినిమాతో మొత్తం 74 పూర్తవుతాయ్. అంటే 75వ చిత్రం ప్రతిష్టాత్మకమే. ఈ చిత్రం ఎవరి డైరెక్షన్ తీస్తే బాగుంటుంది..? ఎవరైతే తనకు హిట్టిస్తారని నిశితంగా ఆలోచించిన వెంకీకి ఫైనల్‌గా ఓ ఐడియా వచ్చిందట.
ఒకానొక సందర్భంలో తనతో సినిమా తీయాలని భావించి.. బిజీ షెడ్యూల్ తీయలేకపోయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు సంప్రదించి అసలు విషయం చెప్పారట. ఇందుకు స్పందించిన త్రివిక్రమ్ తాను ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేశారట. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ‘అల వైకుంఠపురంలో..’ తర్వాత ఆయన ఖాళీగానే ఉంటారు. అందుకే తదుపరి సినిమాను వెంకీతోనే అని మాటల మాంత్రికుడు కూడా ఫిక్స్ అయిపోయారని టాక్ నడుస్తోంది. ఈ కాంబోలో ఇప్పటికే ‘మల్లీశ్వరి’, ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాలు వచ్చిన విషయం విదితమే. ఈ రెండు చిత్రాలకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రెండూ త్రివిక్రమ్ రాసినవే. అంతేకాదు ఈ రెండు చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్టయ్యాయ్. అందుకే ముచ్చటగా మూడో సినిమా తీసి హ్యాట్రిక్ కొట్టాలని అటు వెంకీ.. ఇటు త్రివిక్రమ్ భావిస్తున్నారట.
వాస్తవానికి.. అప్పుడెప్పుడో ‘అరవింద సమేత’ కంటే ముందే వెంకీతో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావించాడు. అంతేకాదు వెంకీ పుట్టిన రోజున నాడు ఓ పోస్టర్‌ను సైతం హారిక అండ్ హారిక క్రియేషన్స్ రిలీజ్ చేసింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమోగానీ వెంకీ సినిమాకు ఫుల్‌స్టాప్ పడిపోయింది. మళ్లీ అల్లు అర్జున్‌తో సినిమా తీయడం.. ఇవన్నీ చకచకా జరిగిపోయాయ్. ‘అల వైకుంఠపురంలో..’ తర్వాత ఆయనకు పెద్దగా ప్రాజెక్ట్స్ కూడా లేవు.. అందుకే వెంకీ అడగ్గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అప్పుడెప్పుడో రద్దయిన సినిమా ఈ సారైనా తెరకెక్కుతుందా..? లేకుంటే యథావిథిగా పరిస్థితులు ఉండిపోతాయా..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.