‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి ఊపు మీదున్న డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. పూరీ, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. అయితే.. ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పూరి-విజయ్ కాంబోలో సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే తన దగ్గరున్న కథకు మెరుగులు దిద్దుతున్న పూరీ.. మరో వైపు విలన్, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లను వెతికే పనిలో నిమగ్నమయ్యాడు. పూరీ సినిమా అంటే దాదాపు కొత్త హీరోయిన్ పట్టుకురావడం, కొత్త కొత్త ఆర్టిస్టులను పరిచయం చేస్తాడన్న విషయం తెలిసిందే.
విజయ్ సరసన హీరోయిన్‌గా ఎవరిని తీసుకురావాలి అని ఓ వైపు పూరీ.. మరోవైపు చార్మీ ఇద్దరూ వెతికుతున్నారట. అయితే ఒకానొక సందర్భంలో విజయ్ దేవరకొండతో తనకు నటించాలని వుందని అందాల సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ చెప్పింది. దీంతో ఆ మాటని పట్టుకున్న పూరీ ఇక హీరోయిన్ దొరికేసినట్లేనని అనుకున్నాడట. విజయ్ సినిమా కావడంతో ఆయన ఇక జాన్వీ మారుమాట చెప్పకుండా ఒప్పుకుంటుందని అలా ప్రయత్నాలు షురూ చేస్తున్నారట. ఎలాగైనా సరే ఈ సినిమాతోనే జాన్వీని టాలీవుడ్‌కు పరిచయం చేయాలని ఫిక్స్ అయిన పూరీ.. జాన్వీ తండ్రి బోనీ కపూర్‌ను ఒప్పించే పనిలో పడ్డారట. అయితే బోనీ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో తనకున్న పరిచయాలతో చార్మీ రంగంలోకి దిగిందట. అయినప్పటికీ వర్కవుట్ అయ్యేపరిస్థితులు మాత్రం కనిపించట్లేదట.
ఈ క్రమంలో.. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అందరికీ సుపరిచితడైన, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన తన గురువు ఆర్జీవీని సంప్రదించారట. ఇటీవలే వర్మకు ఫోన్ చేయగా అభయమిచ్చారట. విషయం మొత్తం విన్నాక..‘ నాకు వదిలెయ్ పూరీ.. నేను చూస్కుంటా.. మై హూనా’ అని చెప్పారని ఫిల్మ్‌నగర్‌లో గట్టిగా టాక్ నడుస్తోంది. శ్రీదేవి కుటుంబంతో పాటు బాలీవుడ్ బిగ్ బీ, ఇలా చాలా మందితో రామ్‌గోపాల్ వర్మకు పరిచయాలున్నాయ్. వాస్తవానికి ఆర్జీవీ కూడా ఒక మంచి కథతో.. తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీని టాలీవుడ్‌కు పరిచయం చేద్దామనుకున్నారన్న విషయం విదితమే. అయితే ఆ అవకాశం కాస్త తన శిష్యుడి రూపంలో వస్తోందన్న మాట. మరి ఆర్జీవీ ఏ మాత్రం బోనీని ఒప్పిస్తాడో..? శిష్యుడికి ఇచ్చిన మాటను వర్మ ఏ మాత్రం నిలబెట్టుకుంటాడో..? అప్పుడెప్పుడో మాట వరుసకు అన్న జాన్వీ తెలుగు తెరపై కనిపించాలన్న ఇంట్రెస్ట్ చూపుతుందో వేచి చూడాలి మరి.