స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిస్తున్న క్రేజీ మూవీ బుధవారం నాడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. బన్నీ సరసన హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తోంది. ‘ఆర్య’, ‘ఆర్య- ’2 చిత్రాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడం విశేషమని చెప్పుకోవచ్చు. గతంలో అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్ కాంబోలో వచ్చిన ‘ఆర్య’, ‘ఆర్య 2’ మ్యూజికల్ హిట్స్ అయ్యాయి. అంటే ముగ్గురికీ ముచ్చటగా మూడో సినిమా అన్న మాట. ఈ ముగ్గురూ కలిశారంటే హ్యాట్రిక్ పక్కా అని చెప్పుకోవచ్చు.
అల్లు అర్జున్‌కు ఇది 20వ చిత్రం కావడంతో ఆచితూచి కథను ఎంచుకున్నాడు. కాగా ‘అల వైకుంఠపురంలో..’ షూటింగ్ పూర్తికాగానే బన్నీ ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు రూమర్స్ వచ్చాయి. బన్నీకి కథ నచ్చలేదని.. కథలో మార్పులు చేర్పులు చేయాలని సుక్కూకే సూచించారని.. అప్పట్లో సుక్కూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని అని వార్తలు వచ్చాయ్!. అయితే రూమర్స్‌ను.. రూమర్స్‌గానే వదిలేయాలని ఎవరూ రియాక్ట్ కాకపోగా చివరికి ఎట్టకేలకు పూజా కార్యక్రమాలతో సినిమా షురూ చేసేశారు. అయితే అలా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయో లేదో ఇదిగో సినిమా స్టోరీ ఇదే.. స్టోరీ రివీల్ అయిపోయింది.. అంటూ వార్తలు పుంకాలు పుంకాలుగా రాసేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం ఎక్కువగా ఉండటమే కాదు.. స్మగ్లింగ్ కూడా ఎక్కువగా జరుగుతుందనేది జగమెరిగిన సత్యమే. అయితే అప్పుడెప్పుడో వీరప్పన్ సినిమా తప్ప.. ఈ స్మగ్లింగ్‌కు సంబంధించి ఎవరూ ఆ యాంగిల్‌ను టచ్ చేయలేదు. అందుకే ఈ నేపథ్యమున్న కథను సుక్కూ ఎంచుకున్నారట. ఇందులో బన్నీ ‘స్మగ్లింగ్’ కార్యకలాపాలకు పాల్పడుతుంటాడని టాక్. ఇలా అన్నీ కార్యకలపాలు దగ్గరుండి చూసుకుంటున్న అల్లు అర్జున్‌కు పోలీసులు, ప్రభుత్వం, మరో గ్యాంగ్ రూపంలో ఇబ్బందులు ఎదురవుతాయట. అప్పుడు వారిని ఎలా అల్లువారబ్బాయ్ ఎలా ఎదుర్కొంటాడు..? మనసు మార్చుకుని జనజీవన స్రవంతిలో కలిసిపోతారట..? అసలు బన్నీలో ఈ మార్పు రావడానికి కారణమెవరు..? అన్నదే అసలు ట్విస్ట్ అంట.
అంతేకాదు బన్నీ తన సినీ కెరీర్‌లో ఇప్పటి వరకూ ఎన్నడూ చూడని లుక్‌లో దర్శనమిస్తారని టాక్. ఇక ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ సేతుపతి.. బన్నీని ఢీ కొడతారని (విలన్‌గా) నటించబోతున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. కథ లీక్ అయినట్లు వస్తున్న రూమర్స్ ఎంతవరకు నిజమో..? అనేది తెలియాలంటే షూటింగ్ పూర్తయ్యి.. థియేటర్లలోకి వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.