దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిందేమీ లేదు.. ఆయనేంటో ఆయన తెరకెక్కించిన సినిమాలను చూస్తే తెలిసిపోతుంది. భక్తి సినిమాలు మొదలుకుని రక్తి కట్టించే వరకూ ఈయన తర్వాత ఎవరైనా.! మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు సినిమా అంటే చాలు మొదట.. పండ్లు, పూలు గుర్తుకొస్తాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే పూలు, పండ్లు అనేవి చెట్టు మీద ఉన్నప్పటి కంటే దర్శకేంద్రుడి చేతిలో పడినప్పుడే మరింత అందంగా కనిపిస్తాయ్.. అదీ ఆయన రేంజ్.
ఇక అసలు విషయానికొస్తే.. రాఘవేంద్రరావు ఎప్పుడు చూసినా తెల్లగడ్డంలోనే కనిపిస్తుంటారన్న విషయం విదితమే. ఆయన గడ్డం లేకుండా గూగుల్ ఫొటోలు దొరకాలన్నా.. కెమెరా కంట పడాలన్నా అది జరగని పనే అని చెప్పుకోవాలి. అయితే ఆయన ఎప్పుడూ ఎందుకు గడ్డంతోనే ఉంటారు..? అసలు ఈ గడ్డం వెనకున్న కథేంటి..? ఈ గడ్డం వెనుక ఏమైనా సెంటిమెంట్ ఉందా లేకుంటే స్టైల్ కోసం అలా పెంచారా..? అనే అనుమానాలు చాలా వరకు అందరికీ వచ్చే ఉంటాయ్. అయితే ఓ ఇంటర్వ్యూ వేదికగా రాఘవేంద్రరావు దీనిపై క్లారిటీ ఇచ్చి అభిమానులు, సినీ ప్రియుల అనుమానాలు పటాపంచ్‌లు చేశారు.
ఇండస్ట్రీలో అడుగుపెట్టాక దర్శకేంద్రుడు 1975లో శోభన్ బాబు హీరోగా ‘బాబు’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. దీంతో రెండో సినిమా ప్రారంభానికి ముందు తిరుపతికి వెళ్లి గడ్డం ఇచ్చి.. ఆ తర్వాత సినిమా చేయడం మొదలుపెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. అప్పట్నుంచి ఎక్కడా గడ్డం తీసుకోలేదని.. నాటి నుంచి నేటి వరకూ అదే సెంటిమెంట్ ప్రతీ సినిమాకు కొనసాగుతోందని దర్శకేంద్రుడు తెలిపారు. ఈ 45 ఏళ్లలో తిరుపతిలో తప్ప ఎక్కడా గడ్డం చేయించలేదని.. అలా తన దర్శకుడి కెరీర్ మొదలైంది అని దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘గడ్డం’ గురించి చెప్పుకొచ్చారు.