దగ్గుబాటి రానా.. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాడు. వాస్తవానికి ఈ ఏడాదిలో బహుశా ఇండస్ట్రీ నుంచి ఎక్కువసార్లు వార్తల్లో నిలిచిన వ్యక్తి రానానే. ఈ మధ్య అన్నీ రూమర్స్, వివాదాలతోనే రానా వార్తల్లోకి ఎక్కుతున్నాడు. అయితే తాజాగా ఓ నిర్మాతపై ఏకంగా ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పిస్తూ.. ఆయన ఇంకెంత మందిని ఇలా మోసం చేస్తారో అంటూ ట్వీట్ చేసి కాస్త గట్టిగానే హడావుడి చేశాడు. 2017లో 1945 పేరుతో ఓ పీరియాడిక్ పేట్రియాటిక్ సినిమాను రానా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతకు రానాకు ఎక్కడ చెడిందో పూర్తి వివరాలు తెలియట్లేదు కానీ ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు.
ఎందుకు డిలీట్ చేసినట్లు!?
‘1945 సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. నిర్మాత పారితోషికాల విషయంలో మోసం చేయటంతో సినిమా పూర్తి కాలేదు. దాదాపు సంవత్సర కాలంగా నేను ఈ చిత్రయూనిట్‌ను కనీసం కలవలేదు. మరింత మందిని మోసం చేసి డబ్బు చేసుకునేందుకు ఇది నిర్మాత ఆడుతున్న నాటకం. ఇలాంటి వారిని నమ్మకండి’ అంటూ రానా ట్వీట్ చేశాడు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ట్వీట్ చేసిన కొద్దిసేపటికే డిలీట్ చేయడం. ఎందుకు ట్వీట్ చేసినట్లు మళ్లీ ఎందుకు డిలీట్ చేశాడో ఆయనకే ఎరుక.
మీరు కాదు.. ప్రేక్షకులు చెబుతారు!
అయితే తనను అంటే ఊరుకుంటాడా.. సమస్యేలేదంటూ తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు నిర్మాత.. ‘సినిమా షూటింగ్ పూర్తయ్యిందో లేదో డైరెక్టర్ నిర్ణయిస్తారు. అయినా సినిమా అసంపూర్తిగా ఉందేమో నిర్ణయించే అవకాశం ప్రేక్షకులకు ఇద్దాం. దాదాపు 60 రోజుల పాటు షూటింగ్ చేశాం. కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. పూర్తికాని సినిమాను ఎవరూ రిలీజ్ చేయరు’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చాడు. మొత్తానికి చూస్తే పరిస్థితులు రానా వర్సెస్ నిర్మాతగా మారిపోయాయ్. మరి మున్ముందు ఈ వ్యవహారం ఎంతవరకూ వెళ్తుందో..? అనేది తెలియట్లేదు.
ఇదిలా ఉంటే దీపావళి కానుకగా రానా కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రీలీజ్ అయ్యింది. ఈ సినిమాను రిపబ్లిక్ డే నాడు రిలీజ్ చేయాలని చిత్రబృందం భావిస్తోంది. కాగా.. 1945 పేరుతో ఓ పీరియాడిక్ పేట్రియాటిక్ సినిమాలో చేస్తున్నట్లు 2017లోనే రానా ప్రకటించిన విషయం విదితమే. మరి ఈ సినిమా ఏ మాత్రం రిలీజ్‌కు నోచుకుంటుందో..? నిర్మాతతో గొడవ వ్యవహారానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో వేచి చూడాల్సిందే మరి.