టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, సంచలనాకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన రామ్‌గోపాల్ వర్మ కొత్త చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. వివాదాలే ఊపిరిగా భావించే ఆర్జీవీ ఇలాంటి వివాదాస్పద సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీలను ఓ రేంజ్‌లో టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల రీలీజ్ అయిన ట్రైలర్‌లో ఇరు పార్టీ నేతలను క్రూరాతి క్రూరంగా చూపించడం గమనార్హం. దీపావళికి ఆర్జీవీ పేల్చిన ట్రైలర్ బాంబు గట్టిగా పేలింది.. మిలియన్లలో వ్యూస్ వచ్చాయ్. ఇది గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఉండే ప్రతీ లీడర్ చూసే ఉంటారు. అయితే ఈ ట్రైలర్‌పై టీడీపీ నేతలు కానీ.. వైసీపీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించట్లేదు. బహుశా భవిష్యత్తులో కూడా స్పందిస్తారో లేదో..!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మొదలుకుని చోటా మోటా తెలుగుతమ్ముళ్లు ఏ రేంజ్‌లో హడావుడి చేశారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అంతేకాదు.. నాడు బాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్జీవీ కనీసం ప్రెస్‌మీట్ పెట్టడానికి పరిస్థితులు అనుకూలించలేదు. పోనీ ఇప్పుడేమో అంతా వైసీపీకి దగ్గరగా ఉంటూ ఫేవర్‌గా తెరకెక్కిస్తున్నారా అంటే అస్సలే లేదు. ఏకంగా ఈ సినిమాలో సీఎంతో గన్ కూడా పట్టించాడు ఆర్జీవీ. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దారుణాతి దారుణంగా పోస్టర్‌లో సభావేదికపై చుట్టూ అమ్మాయిల బోల్డ్‌గా కనిపించడం మరీ దారుణం. ఇంత జరుగుతున్నా లీడర్స్ అంతా ఎందుకు సైలెంట్‌గా ఉన్నట్లు..? ఎవరికీ నోరు లేదా..? లేకుంటే ఆర్జీవీని ఎందుకు కెలికి రెచ్చగొట్టడం, ఆయన్ను హీరో చేయడం ఇష్టం లేదా..? లేకుంటే సినిమా వచ్చే ముందు హడావుడి చేయాలని టీడీపీ, వైసీపీ, జనసేన నేతలు భావిస్తున్నారా..? అన్నది తెలియరాలేదు.
ఇక అదేదో సామెత ఉంది కదా.. కందకు లేని దురద కత్తికి ఎందుకు..? అన్నట్లుగా టీడీపీ, వైసీపీ జనసేన పార్టీకి చెందిన నేతలు ఏం చేయాలో దిక్కుతోచక మిన్నకుండిపోతే.. అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు మాత్రం.. అందర్నీ చూపించి మా పార్టికి సంబంధించిన నేతలను ఎందుకు చూపించలేదేం..? అని ఫీలయ్యారో లేకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్కటి ఉందన్న మాట మరిచిపోయారా అనుకున్నారేమోగానీ..అనంత జిల్లా వేదికగా హడావుడి మొదలుపెట్టారు. జిల్లా టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగరాజు ఈ సినిమా టైటిల్‌పై నిషేధం విధించాలని ఫిర్యాదు చేశాడు. కులాల మద్య గొడవల సృష్టిస్తూ.. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సినిమా టైటిల్ ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు మరీ ముఖ్యంగా ఆర్జీవీ ఎలా రియాక్ట్ అవుతారన్నది వేచిచూడాలి.