లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘ఓ బేబీ’ తర్వాత సమంత ఇక ఏ హీరోతోనూ రొమాన్స్ చేయదని.. ఇలాంటి సినిమాలే చేసుకుంటూ పోతుందని అందరూ భావించిన విషయం తెలిసిందే. అయితే సినిమాలు కూడా చేయాలి కదా అని మళ్లీ తన నిర్ణయం వెనక్కి తీసుకుంది. తమిళనాట బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విజయ్ సేతుపతి, త్రిష నటించిన చిత్రం ‘96’ చిత్రాన్ని తెలుగులో సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తుండగా ఆయనతో సామ్ రొమాన్స్ చేస్తోంది. ఇప్పటికే దాదాపు సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని నవంబర్ చివరి వారంలో థియేటర్లలోకి తేవాలని దర్శకనిర్మాతలు భావించారు.
అయితే.. నవంబర్‌లో రిలీజ్ చేసినప్పటికీ పెద్దగా వర్కవుట్ అయ్యే పరిస్థితులు మాత్రం అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే.. డిసెంబర్‌లో స్టార్ హీరోలు, కుర్ర హీరోల సినిమాలు గట్టిగానే రిలీజ్ అవుతున్నాయ్. ఇప్పటికే బాలయ్య తన 105 చిత్రం ‘రూలర్’గా డిసెంబర్ 20న వచ్చేస్తున్నాడు. అదే రోజు మెగా హీరో ‘ప్రతిరోజూ పండగే’ అంటూ వస్తున్నాడు. కొంచెం గ్యాప్‌లోనే మాస్ మహారాజ్ రవితేజ ‘డిస్కో రాజా’ డిసెంబర్ 25న వచ్చేస్తున్నాడు. అంటే నవంబర్ చివర్లో కాదు కదా.. డిసెంబర్ మధ్యలో రిలీజ్ చేసిన సమంత సినిమాకు కష్టాలు తప్పవన్న మాట.
అందుకే ఇక చేసేదేమీ లేక సినిమా రిలీజ్‌ను వాయిదా వేసుకోవాలని దిల్‌రాజు నిర్ణయించారట. మరోవైపు సమంత కూడా..‘ సార్.. ఇలా అన్ని సినిమాలు ఒకేసారి అంటే పరిస్థితులు అనుకూలించకపోవచ్చేమో ఒకసారి ఆలోచించండి’ అని దిల్‌రాజుతో అని చెప్పి సామ్ తిన్నగా సైడ్ అయిపోయిందట. వాస్తవానికి ‘96’ చిత్రం తమిళ్ ప్రేక్షకులనే కాదు.. తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది.. ఇందుకు కారణం లవ్ బ్కాక్‌డ్రాప్ కావడంతో ఇది ప్రేమజంటలకు తెగ నచ్చేసింది. అందుకే దిల్‌రాజు కూడా రీమేక్ చేయాలనుకున్నాడు. అయితే ఈ రేంజ్‌లో సినిమాల రిలీజ్ ఉంటాయన్నది మాత్రం ఊహించలేదు. మరి అటు ఇటు చేసి చివరికి 2020 జనవరి ఫస్ట్ దాకా తీసుకెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో మరి.