టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, సమంత, కాజల్ నటీనటులుగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ఈ చిత్రం ఆశించినంత స్థాయిలో కాదు కదా.. మహేష్ కెరీర్‌లోనే అట్టర్ ప్లాప్ మూవీగా నిలిచిపోయింది. ఈ చిత్రం తర్వాత సూపర్‌స్టార్ బాగానే గ్యాప్ తీసుకున్నాడు కూడా. ఈ గ్యాప్‌లో సినిమాలేమీ తీయని ప్రిన్స్ సుమారు మూడేళ్లపాటు ఓన్లీ ప్రకటనలు (యాడ్స్) చేస్తూనే సినిమాల్లో వచ్చే రెమ్యునరేషన్ కంటే గట్టిగానే సంపాదించుకున్నాడు.
అసలు ‘బ్రహ్మోత్సవం’ చూస్తున్నంత సేపు అసలు శ్రీకాంత్ అడ్డాల ఏం చెప్పి మహేష్‌ని ఒప్పించాడా..? అనే ప్రశ్న మదిని తొలిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే కథగా చెప్పుకోవడానికి ఇందులో రెండు లైన్లకి మించి ఏమీ లేదన్నది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక మిగిలిన విషయాలన్నీ ఇక్కడ అప్రస్తుతం.. అసందర్భం కూడా. అయితే ఈ సినిమాలో లోపం ఎక్కడుంది..? ఎందుకు ఇంత దారుణంగా సినిమా ప్లాప్ అయ్యింది..? అనేది బహుశా ఇప్పటికైనా దర్శకుడికి అర్థమైందో లేదో తెలియని పరిస్థితి.
అయితే అసలు సినిమా ప్లాప్ వ్యవహారంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత పీవీపీ స్పందించారు. ఈయన ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ‘బ్రహ్మోత్సవం’ మూవీ ఇంత దారుణంగా ప్లాప్ అవుతుందని మేం ఊహించలేకపోయమన్నారు. ఒక సినిమా హిట్ అయినా ఆ క్రెడిట్ దర్శకుడికే ఇవ్వాలి.. అలాగే ఫ్లాప్ అయినా అందుకు బాధ్యత దర్శకుడిదేనని పీవీపీ చెప్పుకొచ్చారు. వాస్తవానికి తండ్రీ-కొడుకుల ఎమోషనల్ కథ కావడంతో మహేష్‌కు బాగా నచ్చిందని.. అయితే కథ అనుకున్నట్లుగా వెండితెరపై శ్రీకాంత్ ప్రొజెక్ట్ చేయలేకపోయారన్నారు. ఇందుకు ఫలితం సినిమా ఎలా ఆడిందో అందరూ తెలిసిందేనని పీవీపీ చెప్పుకొచ్చారు.
ఈ ఒక్క విషయంలో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీవీపీ తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే పీవీపీ వ్యాఖ్యలపై.. ముఖ్యంగా ఆయన ఫెయిలయ్యే అంశంపై శ్రీకాంత్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి. కాగా.. బ్రహ్మోత్సవం సినిమా తర్వాత ఇప్పటి వరకూ ఏ ప్రాజెక్ట్‌ను అడ్డాల పట్టాలెక్కించిన దాఖలాల్లేవ్. మరి మున్ముంథు కూడా ఇలానే మిన్నకుండిపోతారా లేకుంటే మంచి కథతో ముందుకొచ్చి హిట్ కొడతారో వెయిట్ అండ్ సీ.