టాలీవుడ్‌లో ‘పెద్దదిక్కు’.. పెద్దాయనగా పేరుగాంచిన దాసరి నారాయణ రావు లేని లోటు ఈ మధ్య ఇండస్ట్రీలో బాగా కనిపిస్తోందన్న విషయం విదితమే. వాస్తవానికి ఎలాంటి పంచాయితీలు ఉన్నా.. విభేదాలు తలెత్తినా పెద్ద మనిషి తరహాలో దర్శకరత్న సామరస్యంగా పరిష్కార మార్గం చూపేవారు. అయితే ఆయన మరణాంతరం ఎవరి దగ్గరికి వెళ్లాలో.. ఫలానా సమస్య వచ్చిందని చెప్పుకోవడానికి నటీనటులకు దిక్కులేకుండా పోయింది.! మరీ ముఖ్యంగా ప్రస్తుతం ‘మా’లో జరుగుతున్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. అయితే ఇలాంటి క్రమంలో ప్రముఖ దర్శకనిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ తన యూ ట్యూబ్ చానెల్ వేదికగా ఈ వ్యవహారంపై స్పందించారు.
ఇండస్ట్రీలో ఉన్న వాళ్లలో చిరంజీవి పెద్ద ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలుసనీ.. ఆయన తలచుకుంటే ఏ స్థానమైనా తీసుకోవచ్చన్నారు. ఆయన కావాలనుకుంటే.. తలుచుకుంటే ‘దాసరి’ పొజీషన్ అనేది అఫీషియల్ పోస్ట్ కాదన్నారు. సరి పెద్ద మనిషిగా.. అందరితో కలిసి మాట్లాడేవారని ఆయనలాగే చిరంజీవి చేయాలంటే చేయొచ్చనీ తమకు ఎలాంటి అభ్యంతరాల్లేవన్నారు. మీరు అలా చేయండి చిరంజీవి అనీ తానే రెండు మూడు సార్లు ఆయన్ను కోరినట్లు తెలిపారు. అంతటితో ఆగని ఆయన ఇండస్ట్రీలో జరుగుతున్న కొన్ని విషయాలు.. చిరంజీవి-ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీపై సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు, అభ్యంతరాలపై తమ్మారెడ్డి మాట్లాడి తనదైన శైలిలో స్పందించి కౌంటర్లు, జోక్‌ల వర్షం కురిపించారు.