టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో (మా) వివాదాలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయాలని జీవిత, రాజశేఖర్‌లను ఏరికోరి మరీ ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేష్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్ల మధ్యే వార్ నడుస్తోంది. ఇందులో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని వేలెత్తి చూపించట్లేదు. తప్పెవరిదైనా తెలుగు ఇండస్ట్రీని ఇలా రోడ్డుమీదకి ఈడ్చటం బాధాకరం. బహుశా ఈ రేంజ్‌లో గొడవలు ఇప్పటి వరకూ ‘మా’ చరిత్రలోనే లేవన్నది మాత్రం జగమెరిగిన సత్యమే.
అయితే ఈ గొడవలు ఎందుకొస్తున్నాయ్.. ‘మా’లోని సభ్యులు అందరూ ఒక్క నరేష్‌నే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? అసలు దీనివెనుక ఎవరున్నారు..? ఇక్కడ కూడా రాజకీయాలు నడుస్తున్నాయా..? ఇండస్ట్రీలో పెత్తనం చలాయించాలని ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నారా.? అని కాస్త లోతుల్లోకి వెళితే కొన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. అదేమిటంటే.. వాస్తవానికి ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేసినప్పట్నుంచి ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ ఆయన్ను కలవడం.. కనీసం సోషల్ మీడియా ద్వారా కూడా విషెస్ చెప్పలేదు. దీంతో టాలీవుడ్‌లోని వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రావేశాలకు లోనవ్వడం.. మీడియా ముందుకొచ్చి పదేపదే ఈ విషయంపై మాట్లాడటం అందరికీ తెలిసిన విషయమే. అయితే సరిగ్గా ఇదే టైమ్‌లో ‘మా’లో విబేధాలు తలెత్తడంతో ఆ వైసీపీ నేతలు పుండు మీద కారం జల్లినట్లుగా దీన్నే అదునుగా చేసుకుని.. కొందర్నీ రెచ్చగొడుతున్నట్లు తెలుస్తోంది.
కాగా.. జీవిత, రాజశేఖర్, హేమ, పృథ్వి వీరంతా వైసీపీకి చెందిన వారే కావడం.. వీళ్లంతా కలిసి నరేష్‌పై పెత్తనం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో వైసీపీపై అనుమానాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయట. నరేష్ ఆధిపత్యాన్ని సహించలేకపోతున్న వాళ్లు అవసరమైతే మళ్లీ ఎన్నికలకు అయినా పోదామని ఫిక్స్ అయ్యారట. కాగా.. ఘట్టమనేని కృష్ణ కుటుంబం.. వైఎస్ ఫ్యామిలీకి మధ్య మంచి సన్నిహిత సంబంధాలున్నాయ్. అంతే కాదు నిన్న మొన్నటి వరకూ కృష్ణ సోదరుడు ఆది శేషగిరి రావు వైసీపీలోనే ఉన్నారు.. ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఘట్టమనేని అల్లుడు కూడా ప్రస్తుతం టీడీపీలో ఎంపీగా కొనసాగుతున్న విషయం విదితమే. ‘మా’లో రాజుకున్న వివాదం రాజకీయ రంగు పులుముకుందని ఇటీవల జరుగుతున్న గొడవలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని కొందరు సీనియర్ నటులు గగ్గోలు పెడుతున్నారట. ఇది ఎంతవరకు నిజమో పైనున్న పెరుమాళ్లకే ఎరుక.