మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఈ టెర్మ్ ఎన్నికలు ఏక్షణాన జరిగాయో కానీ మొదట్నుంచి ఇప్పటి వరకూ అన్నీ విభేదాలే. ప్రతిరోజు ‘మా’కు సంబంధించిన వార్తలే నెట్టింట దర్శనమిస్తున్నాయి. రోజురోజుకు ఈ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయే తప్ప ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు కనుచూపు మేరల్లో కనిపించట్లేదు. కాగా ఇటీవల మా సభ్యుల సమావేశంలో రగడం జరగడం.. అదికాస్త వాకౌట్ దాకా వెళ్లడంతో రచ్చ రచ్చగా మారింది. అయితే సమావేశంలో అసలేం జరిగింది..? అనే దానిపై తాజాగా ప్రధాన కార్యదర్శి జీవిత ఓ వీడియో రూపంలో వివరణ ఇచ్చారు.
ఆదివారం జరిగిన సమావేశంలో 200 మంది నటీనటులు పాల్గొన్నారని.. వారందరికీ ఈ సందర్భంగా జీవిత థ్యాంక్స్ చెప్పారు. ఈ సమావేశం నిర్వహించడానికి కారణం.. ‘మా’లో కొన్ని సమస్యలు తలెత్తడమేనని.. ఇందుకు చాలా కారణాలున్నాయని ఆమె తెలిపారు. ముఖ్యంగా 26 మంది కమిటీ సభ్యుల మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయన్నారు. ఈ సమస్యలను మేం పరిష్కరించుకోలేకపోయామని అందుకే సమావేశంలో చర్చించాలని నిర్ణయించి మీటింగ్ పెట్టామన్నారు.
‘మెజారిటీ సభ్యులు అత్యవసరంగా ఎక్స్‌ట్రాడ్‌నరీ జనరల్‌బాడీ మీటింగ్ పెట్టుకోవాలని సూచనలు చేశారు. దానికి సంబంధించిన బైలా ప్రకారం ఏం చేయాలనేది పరిశీలించాం. ఆ సమావేశంలో మా లాయర్ గోకుల్, కోర్టులో కేసు వేశారు. మా సభ్యుల్లో 900 మందికి పైగా వున్నారు. అందులో 20శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపితే ఎక్స్‌ట్రాడినరీ జనరల్‌బాడీ జరుగుతుంది. అప్పుడే మా సమస్యలు పరిక్షరించుకోవచ్చు. 20శాతం సభ్యులు ఆమోదం తెలిపితే అప్పటినుంచి 21రోజుల్లోగా మీటింగ్ పెట్టుకోవాల్సివుంటుంది. ఇలా మీటింగ్ జరిగితేనే అందరికీ మంచి జరుగుతుంది. ఇందుకు గాను ‘మా’ ఆఫీసుకు రావడానికి సాధ్యం కాకపోతే ఈ మెయిల్, పోస్ట్ ద్వారా ఆమోదం తెలపండి’ అని జీవిత తెలిపారు.