ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సినీ ఇండస్ట్రీ నుంచి కొందరు మొదట ఆలోచించింది.. నంది అవార్డుల గురించే. జగన్ ఇప్పట్లో అవార్డులు ఇస్తారా..? లేదా..? అసలు ఆ ఊసే ఉండదా అనే ఆలోచించారు. అయితే ఇటీవల సీఎం జగన్-మెగాస్టార్ చిరంజీవిల మధ్య నంది అవార్డుల విషయంపై చర్చకు వచ్చిందని సమాచారం. చిరు చెప్పిన విషయాన్ని నిశితంగా విన్న జగన్.. సానుకూలంగా స్పందించారట. ఇలా ఇండస్ట్రీకి చెందిన సమస్యలు, ఏపీలో సినీ ఇండస్ట్రీ ఇలా పలు విషయాలపై భేటీలో ఈ ఇద్దరి మధ్య చర్చలు జరిగాయట.
అన్నీ అనుకున్నట్లు జరిగితే 2020 మొదట్లో అవార్డుల ప్రకటన చేసి.. సంక్రాంతి తర్వాత ఇచ్చే అవకాశాలు మెండగా కనిపిస్తున్నాయి. కొత్త అవార్డులు ప్రకటించడానికీ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిందని తెలుస్తోంది. కాగా.. జగన్‌తో చిరు భేటీ అవుతారని తెలుసుకున్న టాలీవుడ్‌కు చెందిన కొందరు పెద్దలు ఈ అవార్డ్స్ గురించి కూడా కాస్త చర్చించండి సారూ అని మెగాస్టార్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.
ఎంతైనా.. అవార్డ్ అంటే ఆ కిక్కే వేరు అది ప్రైవేటా? లేకుంటే ప్రభుత్వం ఇచ్చిందా? అనేది పక్కనెడితే.. సినిమాకు ఒక గుర్తింపు అనేది ఇలానే వస్తుంది. మొత్తానికి చూస్తే.. ఏపీలో త్వరలోనే నంది హంగామా మొదలుకానుందన్న మాట. మరి తెలంగాణలో అసలు ఈ హడావుడి ఉంటుందో ఉండదో మరి. గతం ప్రభుత్వంలో నంది అవార్డుల విషయంలో పలువురు సినీ పెద్దలు, దర్శకనిర్మాతలు చాలా వరకు అసంతృప్తితో రగిలిపోయారు. ఓ వర్గానికి.. కొందరి సినిమాలకు ఈ అవార్డులు వచ్చాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మరి జగన్ ఈ మచ్చ తన సర్కార్‌పై పడకుండా ఏ మాత్రం చూసుకుంటారో వేచి చూడాల్సిందే.