టాలీవుడ్‌లో ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపిన విషయం విదితమే. వరుస సినిమాలు చేయడం.. హిట్‌లు గట్టిగానే ఖాతాలో పడ్డాయ్. ఇలా దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో ఈ భామ రొమాన్స్ చేసేసింది. అయితే ఈ మధ్య పాపం ఈ ఢిల్లీ పాపకు అస్సలు కాలం కలిసిరావట్లేదు. ఏ సినిమా చేసినా.. ఏ కథ ఎంచుకున్నా అట్టర్ ప్లాప్ అవుతోంది. దీంతో రకుల్ రేంజ్ స్టార్ నుంచి జీరో పడిపోయింది.
ఇలా వరుస సినిమాల ప్లాప్‌లతో రకుల్ డీలా పడిపోయింది. దీంతో కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఈ బ్యూటీ వీరాభిమానులు షాక్ తిన్నారట. అదేంటి మేడమ్.. మీరు ఇలాంటి నిర్ణయాలు ఇంత సడన్‌గా తీసుకుంటే ఎలా అని సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని ఫ్యాన్స్ వెల్లగక్కుతున్నారట.
మరీ ముఖ్యంగా.. అక్కినేని నాగ్ సరసన ‘మన్మథుడు-2’ నటించిన రకుల్ ఈ సినిమాపై చాలానే ఆశలు పెట్టుకుంది అయితే అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి అనే చందంగా ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఈ సినిమా ప్లాప్ రకుల్‌కు ఒకింత చెడ్డ పేరు కూడా తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్‌లో దాదాపు రకుల్‌కు డోర్‌లు క్లోజ్ అయిపోయాయి. ప్రస్తుతం తమిళంలో భారతీయుడు-2 లాంటి పెద్ద సినిమా చేతిలో ఉన్నప్పటికీ అసంతృప్తి మాత్రం రకుల్‌ను వెంటాడుతోందట. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి కొంత కాలం విరామం తీసుకోవాలని భావిస్తోందట. ఇటీవల చెన్నైలో విలేకరులతో మాట్లాడిన ఈ ముద్దుగుమ్మ తమిళంలోనే కాదు అన్ని భాషల్లోనూ సినిమాలు తగ్గించానని స్వయంగా చెప్పడం గమనార్హం. మరి రకుల్ పరిస్థితి మున్ముందు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.