టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘సైరా’ ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను చూసి ఆదరించాలని ఇప్పటికే అమరావతి టూ ఢిల్లీ వరకు వరుసబెట్టి నేతలను కలిశారు చిరు. మొదట తెలంగాణ గవర్నర్ తమిళసై ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్.. అనంతరం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ఉపరాష్ట్రపతి ఇలా వరుస భేటీలతో బిజీబిజీ అయ్యారు.
అయితే అమరావతి టూ ఢిల్లీ వరకు ఓకే గానీ వయా హైదరాబాద్ మాత్రం చిరుకు వర్కవుట్ అవ్వలేదు.! అంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను మెగాస్టార్ కలవలేదు కదా అదేనండోయ్.. దీంతో అసలు హైదరాబాద్‌లో ఉంటూ పక్కనే ఉన్న గులాబీ బాస్‌ను కలవకపోవడమేంటి..? అసలు కేసీఆర్‌ను చిరు ప్రయత్నం చేశారా లేదా? అని టాలీవుడ్‌లో పెద్ద చర్చే జరిగింది. అయితే అప్పట్లో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె, హుజుర్‌నగర్ ఉపఎన్నిక, వరుస సమీక్షలు ఇలా కేసీఆర్ బిజీబిజీగా ఉండటంతో షెడ్యూల్ కుదరక అప్పట్లో అపాయిట్మెంట్ ఇవ్వలేదట.
వాస్తవానికి చిరుకు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన పెద్ద తలకాయలతో మంచి సంబధాలే ఉన్నాయి. ఈయన రాజకీయాల్లోకి రాక మునుపు నుంచే ఇలా సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకే చాలా వరకు పెద్దోళ్ల ఇళ్లలో కార్యక్రమాలకు చిరు తప్పక హాజరవుతుంటారు. అయితే తాజాగా కేసీఆర్‌తో భేటీపై మరోసారి చర్చ జరుగుతోంది. అప్పుడు కేసీఆర్ బిజీగా ఉండటంతో సీఎంవో నుంచి మీకు పిలుపు వస్తుందని అప్పుడు కలుద్దామని చిరుకు సమాచారం వెళ్లిందట. అయితే త్వరలోనే అపాయిట్మెంట్ దొరుకుతుందని.. కేసీఆర్‌ను కలవొచ్చని ‘సైరా’ భావిస్తున్నాడట. మరి ఈ భేటీ షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందో!