ఇదేంటి.. ప్రధాని స్థాయి వ్యక్తికి డైరెక్టర్ సలహా ఇవ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు వింటున్నది నిజమే.. ప్రధాని మోదీకి ఫలనా సమస్య ఎక్కువైపోతోంది చూడండి సార్ అని చెబుతూనే దాన్ని ఎలా పరిష్కరించాలనేదానిపై కూడా పూరీ వివరణ ఇచ్చారు. అంటే సమస్య చెప్పడం.. సమస్కకు పరిష్కార మార్గం.. కూడా పూరీ చెప్పారన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే మోదీకి సలహా ఇచ్చారని అర్థం. ఇంతకీ ఆ విలువైన సలహా ఏంటి..? అసలు మోదీకి సలహా ఇచ్చే రేంజ్ ఉందా..? అనే విషయాలను ఈ కథనంలో చూద్దాం.
పర్యావరణానికి ప్లాస్టిక్ పెనుభూతంగా మారిందని.. ప్లాస్టిక్ వినియోగం రోజురోజుకు భారీగా పెరిగిపోతుండటంతో పర్యావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని మానేద్దామని మోదీ పిలుపునిచ్చిన విషయం విదితమే. అయితే ఈ విషయంలో మోదీకి సోషల్ మీడియా వేదికగా పూరీ ఓ లేఖ రాసుకొచ్చారు. వాతావరణంలో విపరీతమైన మార్పులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒక్కటే కారణం కాదని, ఇందుకు ఇతర అంశాలు కూడా పర్యావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఇదీ పూరీ సలహా..!
‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధిస్తే పర్యావరణంలో ఒక్కసారిగా మార్పు రాదు. ప్లాస్టిక్‌ను నిషేధిస్తే అందరూ పేపర్ కవర్లు, పేపర్ సంచులను వాడడం మొదలుపెడతారు. దీంతో పేపర్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. చెట్లను ఎక్కువగా నరికే పరిస్థితి వస్తుంది. చెట్ల నరికివేతతో పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మొక్కలు ఎక్కువగా నాటాలి. ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌ను పదేపదే వినియోగించేలా చర్యలు తీసుకోవాలి. తద్వారా ప్లాస్టిక్‌ను ఎక్కడపడితే అక్కడ పడవేయడం తగ్గుతుంది’ అని పూరీ చెప్పుకొచ్చారు. మరి మోదీ ఈ లేఖకు రియాక్ట్ అవుతారో లేదో వేచి చూడాల్సిందే.