మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)లో విభేదాలు రోజురోజుకు తారాస్థాయికి చేరిపోతున్నాయి. అసలు ఈ వివాదానికి ఇప్పట్లో ఫుల్‌స్టాప్ పడే పరిస్థితులు మాత్రం అస్సలు కనిపించట్లేదు. అయితే ఈ వివాదాన్ని సామరస్యంగా చర్చించుకుని పరిష్కరించుకుందామని ఆదివారం నాడు అత్యవసర సమావేశం నిర్వహించారు. అయితే అది కాస్త గందరగోళంగా మారడం.. మా సభ్యులు అలిగి తీవ్ర ఆగ్రహంతో బయటికెళ్లి పోవడం.. పరుచూరి గోపాలకృష్ణ లాంటి పెద్ద మనిషి కూడా కంటతడిపెట్టడంతో వివాదం మరింత ముదిరింది.
ఈ క్రమంలో ఈసీ మెంబర్, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ కాసింత భావోద్వేగానికి లోనయ్యారు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరి గోపాలకృష్ణకు అవమానం జరిగిందని.. ఆయన కంటతడి పెడుతూ వెళ్లిపోయడం బాధాకరమన్నారు. అందుకే తనకున్న ఈసీ మెంబర్ పదవికి రాజీనామా చేస్తానని షాకింగ్ ప్రకటన చేశారు. అంతటితో ఆగని ఆయన.. మూవీ అసోసియేషన్‌లో కొందరు ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’గా ఫీలవుతున్నారని.. ఎవరికి వారు గ్రూపులు పెట్టుకున్నారని ఆరోపించారు. అసలు మా లో ఇలా జరుగుతున్నందుకు బాధపడాలో.. ఇంకేం చేయాలో తనకే తెలియట్లేదన్నారు. అయితే ఇన్ని మాటలు చెప్పిన పృథ్వీ.. కొందరు, గ్రూపులు అని డొంకతిరుగుడుగా మాట్లాడటం కంటే అదేదో వివరాలతో బయటపెడితే బాగుంటుంది కదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
వాస్తవానికి పృథ్వీకి కాస్త నోరు ఎక్కువేనని.. మరీ ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత డోస్ పెంచి మరీ మాట్లాడుతున్నారనే ఆరోపణలు కోకొల్లలు. ఇందుకు ఉదాహరణలు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా.. ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పై వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి చేశారు..? అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఫీలవుతున్నదెవరు..? ‘మా’లో గ్రూపుల పంచాయితీ ఏంటి..? రాజీనామా నిజంగానే చేసేస్తారా ఏంటి..? ఆయన ఇంత ఆగ్రహం, భావోద్వేగానికి ఎందుకు లోనైనట్లు..? అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. మరి పృథ్వీ వ్యాఖ్యలకు ఎవరైనా రియాక్ట్ అవుతారో లేకుంటే అబ్బే.. ఈయన మాటలకు మేం స్పందించాలా అని లైట్ తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.