మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) లో జరుగుతున్న విభేదాలతో టాలీవుడ్ పరువు ఏమవుతుందో ఏమో అని నటీనటుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఎప్పుడూ మాలో గొడవలు ఉండేవే కానీ.. ఈ టెర్మ్ ఎన్నికలు జరిగినప్పట్నుంచి అస్సలు పరిస్థితులు అనుకూలించట్లేదు. రెండ్రోజులకోసారి పంచాయితీలు జరుగుతున్నాయి. అంతేకాదు.. మీటింగ్‌లో పెట్టుకోవడం.. కొట్టుకునేంతగా గొడవపడటం.. వాకౌట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే రోజురోజుకో వివాదం పెరిగిపోతోందో తప్ప ఫుల్‌స్టాప్ పడే అవకాశాలు మాత్రం ఎక్కడా కనిపించట్లేదు.
అయితే.. ఇది వరకు ఇలాంటి గొడవలు వచ్చినా, టాలీవుడ్‌లో ఏ కార్యక్రమమైనా చేపట్టాలన్నా, పంచాయితీలు చేయాలన్నా దర్శకరత్న దాసరి నారాయణరావు ‘పెద్దాయన’గా అన్నీతానై చూసుకుంటూ.. సలహాలు, సూచనలు ఇస్తూ ఉండేవారు.. ఇప్పుడు ఆయన లేరు గనుక ఆ లోటు ఎలా ఉంటుందో స్పష్టంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి అర్థమవుతోంది. అయితే టాలీవుడ్‌కు ఇప్పుడు ‘పెద్దాయన’ పాత్ర పోషించడానికి ఎవరున్నారు..? ఇలాంటి విభేదాలు వచ్చినప్పుడు ఎవరు రంగంలోకి దిగాలి..? అసలు ప్రస్తుతం ‘మా’లో నెలకొన్న వివాదాల్లాంటి సమస్యలకు పరిష్కారం ఎవరు చూపుతారు..? ‘మా’ దిక్కెవరు..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
వాస్తవానికి అప్పుడు.. ఇప్పుడు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు ఇంకా పెద్ద తలకాయలు ఎలాంటి ప్రియారిటీ ఇస్తారో.. ఎలా గౌరవిస్తారో అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో దాసరి పోషించిన ‘పెద్దాయన’ పాత్రకు.. ఇప్పుడు చిరు అయితే కరెక్టుగా సెట్ అవుతారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొన్న విభేదాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు మెగాస్టార్ రంగంలోకి దిగుతారని సమాచారం. కాగా ‘మా’ అసోసియేషన్ స్థాపించాలన్న ఆలోచన చిరుదే.. ఆయనే షౌండర్ అన్న విషయం విదితమే.
ఎందుకంటే రోజురోజుకు వివాదం ముదురుతుండటం.. టీవీల్లో, పేపర్లు, వెబ్‌సైట్లలో పెద్ద ఎత్తున వార్తలు వస్తుండటం ఇలా మనకు మనంగా ‘మా’ ను రోడ్డున పడేసుకున్నట్లవుతుందని భావించిన కొందరు టాలీవుడ్ పెద్దలు.. పెద్దాయన పాత్ర పోషించాల్సిందేనని చిరును గట్టిగా పట్టుబట్టారట. అయితే చిరు ఎలా రియాక్ట్ అయ్యారు..? మెగాస్టార్ ఏ మాత్రం ఈ సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారో..? అసలు పెద్దాయన పాత్ర పోషించడానికి ఏ మాత్రం సుముఖత చూపుతారన్నది తెలియాల్సి ఉంది.