సినిమా ఇండస్ట్రీ ఎవరిదీ కాదు.. టాలెంట్ ఉన్నవారికి వెంటనే కాకపోవచ్చు కానీ, ఏదో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఓపిక ముఖ్యం. అలాగే వారసుల హవాను ఎదుర్కొంటూ కొత్త కొత్తవారు ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా కొత్త కొత్త ముఖాలతో టాలీవుడ్ ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంది. విడుదల విషయంలో ఇబ్బందులు అనే మాటే కానీ, అలాంటి ప్రభావం ఏ మాత్రం పడకుండా ఇప్పుడు చిన్న సినిమాలు టాలీవుడ్‌ని టార్గెట్ చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ సక్సెస్ రేట్‌కు అవే కొలమానంగా నిలబడుతున్నాయి. ప్రతివారం బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా ఏదో ఒక చిన్న సినిమాకు స్పేస్ ఉంటుంది. ఈ వారం నాలుగు సినిమాలు బాక్సాఫీస్‌ను పలకరించాయి.
ఇందులో కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన చిత్రం ‘మళ్లీ మళ్లీ చూశా’. తండ్రి నిర్మాతగా, కొడుకు హీరోగా పరిచయం అయిన ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారంటే.. కమర్షియల్ లవ్ స్టోరీ కొత్తవారితో వర్కవుట్ అవుతుందా అని ఆలోచించకుండా ఖర్చుకు వెనకాడకుండా ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉండేలా అయితే తెరకెక్కించారు కానీ, దర్శకుడిగా మాత్రం హేమంత్ కార్తీక్ మ్యాజిక్ చేయలేకపోయాడు. మళ్లీ మళ్లీ చూసేలా చేయగలిగిన కథ ఉండి కూడా, ఒక్కసారి చూస్తే చాలు అనిపించే కథనంతో సరిపెట్టేశాడు. ఈ కథని సరైన ఎంటర్‌టైన్‌మెంట్ వే లో నడిపించి ఉంటే, టాలీవుడ్‌లో ఇలాంటి లవ్ స్టోరీలకు ఈ సినిమా నడక నేర్పేది.
కొత్త కుర్రాడు అనురాగ్ నటనపరంగా వంకలు పెట్టడానికి ఏమీ లేదు కానీ, కాస్త ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌పై మాత్రం దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సొంత బ్యానరే అయినా నటుడుగా గుర్తింపు తెచ్చుకోవాలనే అతని ప్రయత్నం బాగుంది. మాస్ విషయం పక్కన పెడితే.. యూత్‌కు నచ్చే అంశాలు మాత్రం సినిమాలో బాగానే జోడించారు. కథపరంగా నాగార్జున-పూరీ కాంబినేషన్‌లో వచ్చిన ‘శివమణి’కి దగ్గరగా ఉన్నా, ఆ ఛాయలు లేకుండా డైరెక్టర్ బాగానే మ్యానేజ్ చేశాడు. నిర్మాణ విలువలకు వంక పెట్టాల్సిన పనిలేదు. మొత్తంగా ఈ సినిమా మళ్లీ మళ్లీ చూసేలా అయితే లేదు కానీ.. ప్రమోషన్ చేసుకుని ప్రేక్షకులతో ఒకసారి అటెంప్ట్ చేయవచ్చు అనిపించే కంటెంట్ అయితే ఉంది.