‘సైరా’ సూపర్ హిట్టవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ మంచి ఊపు మీదున్నారు. ఇక వరుస సినిమాలు చేస్తూ బిజిబిజీగా మెగాస్టార్ గడపనున్నారు. ఇప్పటికే చిరు-కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా క్లాప్ కొట్టేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే కథ, చిరు డబుల్ రోల్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగు చూసింది.
చిరంజీవి పాత్రలో చెర్రీ నటిస్తున్నారనేదే ఆ రూమర్ యొక్క సారాంశం. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ సుమారు 15 నిమిషాలు పాటు ఉంటుందని.. ఇందులో చిరంజీవి యంగ్‌గా ఉంటారట. ఆ యంగర్ చిరుగా రామ్ చరణ్ నటిస్తారని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే మెగాభిమానులకు డబుల్ పండుగే మరి. అంటే ఒకప్పుడు తన సినిమాలో తండ్రి చిరు గెస్ట్ రోల్ చేయగా.. ఇప్పుడు మెగాస్టార్ సినిమాలో ప్రత్యేక పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నారన్న మాట.
ఇప్పటికే.. మలయాళ సినిమా ‘లూసిఫర్’ రీమేక్ హక్కులను రామ్‌చరణ్ కొన్నారని అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో అధికారికంగా ప్రకటన ఉంటుందని కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. ఈ సినిమాలో మల్టీస్టారర్ కావడంతో చిరు-చెర్రీ లేదా.. చిరు-పవన్‌లు నటిస్తారని పుకార్లు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత ఉందో. అయితే.. సైరా సినిమాలో తండ్రితో కలిసి నటించలేకపోయిన చెర్రీ.. కొరటాల సినిమాతో లేదా.. లూసిఫర్‌తో ఆ లోటు పూర్తి చేసుకుంటారన్న మాట.