టాలీవుడ్‌ను ఒకప్పుడు ఓ ఊపు ఊపిన విజయశాంతి అలియాస్ రాములమ్మ.. రాజకీయాల్లోకి వెళ్లి అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. సినిమాల్లో ఉన్నన్ని రోజులు విజయశాంతిని ఢీ కొట్టే నటీమణులే లేరు.. అయితే సినిమాలు ఇక చాలని రాజకీయాల్లో కూడా రాణించాలని వెళ్లిన ఆమె.. అనుకున్నదొక్కటి.. పాలిటిక్స్‌లో దిగాకా జరిగిందొక్కటి. దీంతో ఇక రాజకీయాలకు కాస్త విరామం ఇచ్చిన రాములమ్మ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేసింది. 13 ఏళ్ల గ్యాప్ తర్వాత.. సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో రాములమ్మ రీ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్పటికే ఈమెకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరణ కూడా పూర్తయ్యింది.
ఇదిలా ఉంటే.. సరిలేరు నీకెవ్వరు సినిమాలో టాలీవుడ్ ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కూడా నటిస్తున్నారు. అయితే రాములమ్మ,.. ఈ రచయిత ఇద్దరూ షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలను తన యూ ట్యూబ్ చానెల్ ద్వారా పంచుకున్నారు. విజయశాంతితో తాను కలిసిన నటించిన సినిమాలు చాలా తక్కువని.. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్‌లో ఆమె తనతో మాట్లాడాలని అనుకుంటున్నారని మేకప్‌మెన్ వచ్చి చెప్పారని.. వెంటనే తాను వెళ్లి ఆమెతో మాట్లాడినట్లు గోపాలకృష్ణ తెలిపారు. మా ఇద్దరి చాలా విషయాలకు చర్చకు వచ్చాయని చెప్పిన ఆయన.. ఇదే వీడియోలో రాములమ్మకు కొన్ని సలహాలిచ్చారు.
‘మీరు ఎందుకు ఇండస్ట్రీకి దూరమయ్యారో.. ఎందుకు మళ్లీ వచ్చారో తెలియదు కానీ.. మీరు నటనను దయచేసి కొనసాగించండి.. దయచేసి నటించడం ఆపొద్దమ్మా.. రాజకీయాలు ఈ రోజుల్లో ఎలా ఉన్నాయో మీకు బాగా తెలుసు. నువ్వు ఎన్నో చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను’ అని పరుచూరి బ్రదర్ ఆకాంక్షించారు. మరి ఈ వ్యాఖ్యలపై రాములమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో.. అసలు ఏ మాత్రం పాటిస్తుందో వేచి చూడాలి.