ఆది సాయికుమార్ కథానాయకుడిగా, ప్రముఖ రచయిత అబ్బూరి రవి ప్రతినాయకుడిగా సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ (ఒ.జి.యఫ్). ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ .బిహెచ్, సతీష్ డేగల, ఆర్టిస్ట్స్ మరియు టెక్నీషియన్స్ నిర్మాతలు. ‘ఎయిర్ టెల్’ మోడల్ శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ ఈ చిత్రంలో ప్రధాన తారాగణం. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత రాజశేఖర్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత రాజ్ కందుకూరి, యంగ్ సెన్సేషనల్ హీరో అడివి శేష్ అతిథులుగా హాజరయ్యారు. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్ లో విడుదల అయింది.
డా. రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘టైటిల్ బాగుంది. యూత్ ను ఎట్రాక్ట్ చేసేలా ఉంది. చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ సినిమాను నిర్మించి, విడుదల చేస్తున్నప్పుడు... యూత్ ఎట్రాక్ట్ అవుతారు. మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. నేను ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నా. పోలీస్ క్యారెక్టర్లు చేసే హీరోలందరూ ఈ వేదికపై ఉన్నారు. ఇటీవల అడవి శేష్ పోలీస్ క్యారెక్టర్ చేశారు. నేను చాలా పోలీస్ క్యారెక్టర్లు చేశా. సాయికుమార్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. అబ్బూరి రవి గారి గురించి జీవిత, అడవి శేష్ నాకు చెబుతూ ఉంటారు. ఆయన ఫేమస్ రైటర్. చేయి పెడితే గోల్డే. ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ కూడా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అబ్బూరి రవి గారు నటించడం కష్టమన్నారు. కాదు... రాయడమే కష్టం. రైటర్స్ కి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని నేను అనుకునేవాడిని. అయితే... ‘ఎవడైతే నాకేంటి’ కథ, మాటలు, స్క్రీన్ ప్లే రాసినప్పుడు రైటర్ కష్టం తెలిసింది. అప్పుడు రైటర్స్ కి ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోదని అనుకున్నా. సాయి కుమార్ గారు మైసూర్ లో ఉండడం వల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. ఆయన తరుపున నేను వచ్చాను. ఆది వండర్ ఫుల్ ఆర్టిస్ట్. చాలా కష్టపడతాడు. ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటాడు. యంగ్ హీరోలందరూ కలిసి డబ్బులు పెట్టి ఒక సినిమా చేశారు. నేను అటువంటి మనస్తత్వం ఉన్న హీరోనే. ఇప్పటికీ చెబుతూ ఉంటా... నాకు కథ నచ్చితే రెమ్యూనరేషన్ ఇవ్వొద్దు అని. కొత్త దర్శకులు, నిర్మాతలకు డబ్బులు వస్తే ఇవ్వమని చెప్తా. నమ్మకం ఉంటేనే సినిమా చేస్తాను కదా! నమ్మకం ఉంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే తీసుకోవాలి అనే మనస్తత్వం నాది. అందరూ ఇదే పద్ధతి పాటిస్తే ఇండస్ట్రీ బాగుంటుంది’’ అన్నారు.
అడివి శేష్ మాట్లాడుతూ.. ‘‘మనం ఒక పని చేస్తే, ఆ పనికి విలువ ఉందని ప్రజలకు గుర్తుండి పోయేలా చేయడం చాలా కష్టమైన విషయం. మనకు క్రెడిబిలిటీ రావాలి. అందరూ ఈ సినిమాకి చాలా కష్టపడి పని చేశారు. ఈ సినిమాకు పని చేసిన వాళ్ళు అందరూ నాకు ఫ్యామిలీతో సమానం. ఈ సినిమాకు ఒక క్రెడిబిలిటీ, రెస్పెక్ట్ వచ్చాయి. అక్టోబర్ 19న ప్రసాద్ ఐమాక్స్ లో ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. నాతోపాటు ప్రేక్షకులందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘‘సాయి కుమార్, సురేఖ దంపతుల బదులు రాజశేఖర్ గారు, నేను వచ్చాం. వాళ్ళిద్దరికీ ఆది ఎంతో... మాకు అంతే. ఇప్పుడు మా అమ్మాయిలు ఇద్దరు నటిస్తున్నారు. వాళ్ళ సినిమాలు విడుదలైతే నేను ఎంత టెన్షన్ పడతామో... ఆది సినిమా విడుదలైనా అలాగే ఫీల్ అవుతాం. ఇక్కడికి వచ్చాక ఈ సినిమా కథ గురించి తెలిసింది. సైనికుల త్యాగాల గురించి తెలుసుకున్నా. సైనికుల పోరాటాలు, మరణాల గురించి పేపర్లలో చదివి ఊరుకోవడం కాదు అంతకు మించి ఆలోచించాలనే ఆలోచనను ఇందులోని దేశభక్తి గీతం కలిగించింది. ఎన్.ఎస్.జి కమాండోగా ఆది గెటప్ చాలా బాగుంది. ఇప్పటివరకు అతడిని లవర్ బాయ్ గా, యాక్షన్ హీరోగా చూశాం. కానీ, ఆర్మీ అధికారిగా చాలా బాగా చేశాడు’’ అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఈ ఫంక్షన్ కి నేను అతిథిగా కాదు, అది కుటుంబ సభ్యుడిగా వచ్చాను. సాయి కుమార్ గారు నిన్న సాయంత్రం ఫోన్ చేసి, ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నేను అటెండ్ కావడం లేదు మన ఫ్యామిలీ మెంబర్ గా నువ్వు వెళ్ళు’’ అన్నారు. ఆది చాలా కష్టపడుతున్నాడు. ఈ సినిమాతో అతడికి మంచి హిట్ రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. రైటర్ గా అబ్బూరి రవి గారు తెలుసు. యాక్టర్ గా ఆయనేంటో ఈ సినిమాలో చూస్తాం. ఆయన మంచి ఆర్టిస్టుగా కూడా పేరు తెచ్చుకోవాలని... మళ్లీ మాతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాను. సాయి కిరణ్ గారి సినిమాలు అన్నీ బాగుంటాయి. ఈ సినిమా కూడా ఆయన కెరీర్ లో మంచి సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘‘టైటిల్ ఎక్స్ట్రార్డినరీగా నచ్చింది. ఆర్టికల్ 370 హిట్ లో ప్రజలందరూ ఉన్న సమయంలో ఈ సినిమా విడుదల అవుతోంది. సరైన సమయంలో లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాని నాకు అనిపిస్తోంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్ లో 1990లలో కశ్మీర్ పండిట్లకు ఏం జరిగిందో చాలామందికి తెలియదు. కశ్మీర్ ఇష్యూను టచ్ చేద్దామని అనుకున్నప్పుడు రచయిత అబ్బూరి రవి గారు చాలా పరిశోధన చేశారు. నేను, ఆయన కశ్మీర్ పండిట్లను కలిసి... ఏం జరిగింది? ఏంటి? అని పరిశోధన చేశాం. కశ్మీర్ పండిట్లకు జరిగినది బాధాకరమైన విషయమే. కానీ, జనాలకు తెలియని చేసిన ప్రయత్నం ఇది. అందరినీ భాగస్వామ్యులుగా చేసుకుని ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తి అబ్బూరి రవి గారు. ‘నువ్ డౌట్ పడకు సాయి. నిన్ను నువ్వు నమ్ము. నేను నమ్ముతాను. అందరూ నమ్ముతారు’ అని చెప్పి... నా వెన్నంటే ఉన్నారు. స్క్రిప్ట్ దగ్గరనుంచి ప్రతి విషయంలో ఎంతో సహాయం చేశారు. ఈ ప్రాజెక్ట్ ఈ స్టేజ్ కి రావడానికి కారణం మెయిన్ బ్యాక్ బోన్ అబ్బూరి రవి గారు. ఘాజీ బాబా పాత్రలో నటించమని ఆయన్ని నటించమని ఒప్పించడానికి నాకు మూడు నెలలు పట్టింది. మన పార్లమెంట్ మీద జరిగిన ఎటాక్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్. ఆర్ ఎస్ ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి అయితే తీవ్రవాదాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని ఆలోచించి... అమిత్ షా గారి స్ఫూర్తితో మా సినిమాలో రావు రమేష్ గారి పాత్రను డిజైన్ చేశాను. నా జేబులో 3500 రూపాయలు ఉన్నప్పుడు, ఆరు కోట్ల సినిమా తీయాలని అనుకున్నప్పుడు... అబ్బూరి రవి గారు ఇచ్చిన ధైర్యం మరువలేనిది. వెయ్యి కోట్లతో సమానం. అదే సినిమాను పూర్తి చేయించింది. ఆ టైం లో నాకు గ్రేట్ సపోర్ట్ ఇచ్చినది... కేశవ్, ఆస్ట్రేలియాలో ఉన్న నా క్లోజ్ ఫ్రెండ్ ఆశిష్ రెడ్డి, వైజాగ్ దామోదర యాదవ్, నా వైఫ్ ప్రతిభ, పద్మనాభరెడ్డి. ఆర్టిస్టులకు కథ నచ్చడంతో ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామ్యులుగా చేయాలని అడగ్గానే ఎస్ అన్నారు. అందరికీ థాంక్స్. ఇంతమంది కలిసి చేయకపోతే ఈ సినిమా ఉండేది కాదు నేను ఇక్కడ నిలబడే వాడిని కాదు. ఆది నటిస్తాడో? లేదో? అనుకున్నాను. తను సినిమా చేయడానికిి ముఖ్య కారణం సాయి కుమార్ గారు. ఆయన కథ విని చాలా పెద్ద స్పాన్ ఉన్న కథ అన్నారు. ఆయనకూ థాంక్స్. ‘వందేమాతరం’ అంటే రియాక్షన్ ఎలా ఉంటుందో... ఈ సినిమాకు థియేటర్లలో రియాక్షన్ అలా ఉంటుంది" అన్నారు.
అబ్బూరి రవి గారు మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్ అనగానే పాకిస్తాన్, ఎల్ ఓ సి, తీవ్రవాదులు రావడం, గొడవల గురించి తెలుస్తాయి. కానీ నీ కాశ్మీర్ పండిట్లను కలిసినప్పుడు ఎనిమిది గంటలపాటు మాట్లాడాం. కన్నీళ్లు ఆపుకోవడం కష్టమయ్యే అంత కష్టాలు వాళ్ళకి ఉన్నాయి. ఓ అమ్మాయిని బ్రతికించుకోవడానికి ఆమె తండ్రి, మావయ్య కలిసి పీకల్లోతు నీళ్ళలో తీసుకువెళ్లి ఒక రోడ్డు వద్దకు చేర్చి ఏదో ఒక వెహికల్ పట్టుకుని వెళ్ళిపొమ్మని చెప్పారు. అలా ఇక్కడకు వచ్చి సెటిల్ అయిన అమ్మాయిని మేం కలిశాం. అలా ఇంకొకాయన ఉన్నారు. ఆయన పేరే భారత్. 1990లో 200 ఎకరాలు అక్రూట్ పండే పొలాలు, కారు ఉన్న ధనికులు. కశ్మీర్ పండిట్లపై మారణకాండ జరిగిన సమయంలో జమ్మూ వరకు కారులో వచ్చి రోడ్లపై నిద్రించారట. కేవలం బతికి ఉండడానికి. మన ఇండియాలో జరిగిన ఈ ఘటనల గురించి మనకు ఎవరికీ తెలియదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇవన్నీ సినిమాలో ఉండవు. కానీ, ఇవన్నీ తెలిసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీశాం. ఎమోషన్ ను క్యాష్ చేసుకోవడానికి ఈ సినిమా తీయలేదు. మాకు తెలిసిన విషయాలను పదిమందికి చెబుదామని సినిమా తీశాం. కేవలం ఆ సమస్య మీద మాత్రమే తీయలేదు. మేం ఎనిమిది కుటుంబాలను మాత్రమే కలిశాం. మాకు ఎనిమిది కథలే తెలుసు. ఇంకా ఎన్ని వందల కథలు ఉన్నాయో. వాళ్ల బాధను చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నం. ఇక్కడ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు... ఇందులో విలన్ ఘాజీ బాబా అనేవాడు ఒకడు ఉన్నాడు అని నాకు తెలియదు. ఈ కథలో విలన్ ఎలా ఉండాలంటే... ‘కళ్ళ ముందు చావు ఉన్న కళ్ళల్లో భయం ఉండకూడదు’ అని అనుకున్నాం. ఒక బాజీ బాబా ఉన్నాడని తెలిసి... అతని గురించి తెలుసుకున్నాం. ఆ పాత్రలో నటించా. రైటర్ ని. ఎలా చేశానో దర్శకుడు సాయి కిరణ్ అడివి, ప్రేక్షకులే చెప్పాలి. నటుడిగా వేదికపై నిలబడడం కొత్తగా ఉంది. ఆర్టిస్ట్ కావడం అనేది చాలా కష్టమైన విషయం. అడవి శేష్ కి సారీ... అతని సినిమాల్లో నటించమని అడిగాడు. కానీ నేను చేయలేకపోయా’’ అన్నారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘కశ్మీర్ ప్రతికూల పరిస్థితులు, వాతావరణం మధ్యలో కథలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించాం. సాయి కిరణ్ అన్న, అబ్బూరి రవి గారు నాకంటే ముందే అక్కడికి వెళ్లారు. నీళ్లు కింద పోస్తే సెకన్లలో మంచులా మారేది. అటువంటి పరిస్థితుల్లో మేం షూటింగ్ చేశాం. నిజంగా... కశ్మీర్ కి వెళ్లి, ఎన్.ఎస్.జి కమాండో డ్రెస్ వేసుకుని షూటింగ్ చేయడం చాలా గర్వంగా అనిపించింది. అక్కడ కొంత మంది ఆర్మీ అధికారులను కలిశాను. వాళ్లు చేస్తున్న త్యాగాలను కళ్లారా చూశాను. ఈ రోజు మనమంతా ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నామంటే ఇండియన్ ఆర్మీనే కారణం. వాళ్లకు సెల్యూట్ చేయాలి. ఈ సినిమాతో చాలా నిజాలు బయటకు వస్తాయి. సాయి కిరణ్ గారు కథ చెప్పి... ఎన్.ఎస్.జి కమాండో అర్జున్ పండిట్ పాత్రకు నిన్ను అనుకుంటున్నానని చెప్తే నేను నమ్మలేదు. సూట్ అవుతానా? లేదా? అని డౌట్ పడ్డాను. నన్ను నేను నమ్మలేదు. కానీ సాయికిరణ్ నన్ను నమ్మారు. ఆయన ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అక్టోబర్ 18న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. నా కోసమో... ఎవరి కోసమో కాదు... సాయికిరణ్ అడివి కోసం. ఈమధ్య నాకు చాలా ఫెయిల్యూర్స్ వచ్చాయి. నాకు ఈ సక్సెస్ ఇంపార్టెంట్. ఈ సినిమా చూశాక ప్రేక్షకులకు ప్రౌడ్ ఇండియన్ అనే ఫీలింగ్ వస్తుంది’’ అన్నారు.
అనీష్ కురువిల్లా మాట్లాడుతూ.. ‘‘ఈ కథ చెప్పడానికి చాలా రోజుల నుంచి కష్టపడి పనిచేస్తున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి నిజమైన హీరోలు. ప్రజలు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన కథ ఇది. కాశ్మీర్ పండిట్ల సమస్య ఎప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ప్రోజెక్ట్ కాలేదు. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలో దాని డిజైన్ చేసి ఫ్రెండ్షిప్, లవ్, ఆర్మీ నేపథ్యంలో తీశారు. సినిమాలో నా పాత్రను సాయికిరణ్ అద్భుతంగా డిజైన్ చేశారు’’ అన్నారు.
కృష్ణుడు మాట్లాడుతూ.. ‘‘సాయి కిరణ్ ఈ సినిమా కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. అరకులో, లంబసింగిలో మేమంతా ఒక పిక్నిక్ లా ఈ సినిమా షూటింగ్ చేశాం. షూటింగ్ లో డబ్బులు రావు గారిని చూస్తే నిజంగా ఒక తీవ్రవాదిని చూసినట్టే అనిపించింది. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయారు’’ అన్నారు.
మనోజ్ నందం మాట్లాడుతూ.. ‘‘భారతీయుణ్ణి అయిన నేను ఈ సినిమాలో తీవ్రవాదిగా, పాకిస్తానీగా నటించాల్సి రావడం బాధాకరమైన విషయం. సాయి కిరణ్ గారిని మొదట కలిసినప్పుడు ఒక సినిమా చేద్దామనుకుంటున్నాను. అందులో నీకు పాత్ర ఉంటుందో ఉండదో చెప్పలేను. కానీ అప్పుడప్పుడు కలుస్తూ ఉండు అన్నారు. కొన్నిసార్లు కలిశాక ‘విలన్ గా చేస్తావా’ అని అడిగారు. నేను సందేహిస్తే... ఆయనే నాలో కాన్ఫిడెన్స్ నింపారు. ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే సినిమా ఇది’’ అన్నారు.
పార్వతీశం మాట్లాడుతూ.. ‘‘నేను ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కంటే ఈ సినిమాలో ఓవరాక్షన్ తక్కువ చేశా’’ అన్నారు.
కార్తీక్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఆరు కోట్లతో ఈ సినిమా తీయడానికి కారణం సాయి కిరణ్ గారు ఆయన టీమ్ హార్డ్ వర్క్. ఇదొక క్రాస్ జానర్ ఫిల్మ్. ఇందులోని ప్రేమకథలో నేను నటించా. వాస్తవ సంఘటనల ఆధారంగా నా ప్రేమకథను రాశారు. విడుదల తర్వాత ఆ వాస్తవాలు ఏమిటో చెబుతారు’’ అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. ‘‘ఒక్క పాటతో నా ప్రయాణం మొదలైంది. అడివి శేష్ ‘కిస్’ సినిమాలో ఒక పాట చేశా. అప్పటినుంచి ఇప్పటివరకు పాతిక సినిమాలు చేశా. నాకు తొలి అవకాశం ఇచ్చిన సాయికిరణ్ అడివి, శేష్ కి ఎప్పటికి రుణపడి ఉంటా’’ అన్నారు.
నిర్మాత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా కార్యక్రమానికి విచ్చేసిన రాజశేఖర్ గారు, జీవిత గారు, అనిల్ రావిపూడి గారు, అడివి శేష్ గారికి థాంక్స్. ఇటీవల వాట్సాప్ లో ఒక మెసేజ్ చూసి ఎమోషనల్ అయ్యా. అదేంటంటే... ఒక సైనికుడు ప్రతి రోజూ ఎటిఎం నుండి 100 డ్రా చేస్తున్నాడు. ప్రతిరోజూ అతను అలా ఎందుకు చేస్తున్నాడో తెలియక ఇంటరాగేట్ చేశారట. ‘నేను డబ్బులు డ్రా చేస్తే మొబైల్ కి ఎస్.ఎం.ఎస్. వెళుతుంది. ఆ మొబైల్ నా వైఫ్ దగ్గర ఉంది. నేను బతికి ఉన్నానని తనకు తెలుస్తుంది. అంతే తప్ప వేరే దురుద్దేశం లేదు. ఇక్కడే మరణిస్తే... డబ్బులు డ్రా చేయలేను. మా ఆవిడకు తెలుస్తుంది’ అన్నారట. అటువంటి సైనికుల నేపథ్యంలో సినిమా తీయడం సంతోషంగా ఉంది. మేం యు అండ్ ఐ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ స్థాపించిన కొద్ది రోజులకు సాయికిరణ్ గారు పరిచయం అయ్యారు. ప్రతి భారతీయుడు గర్వపడే చిత్రమిది. సినిమా సూపర్ గా వచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు పద్మనాభరెడ్డి, కేశవ్, ప్రతిభ, గాయనీగాయకులు సత్య యామిని, యామిని ఘంటసాల, కునాల్, ఎడిటర్ గ్యారీ తదితరులు పాల్గొన్నారు.
బ్యానర్: వినాయకుడు టాకీస్
కాస్ట్యూమ్ డిజైనర్: కీర్తి
ఫైట్స్: రామకృష్ణ, సుబ్బు-నభా
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
ఎడిటర్: గ్యారీ .బిహెచ్
సినిమాటోగ్రఫీ: జైపాల్ రెడ్డి నిమ్మల
స్క్రిప్ట్ డిజైన్: అబ్బూరి రవి
పి.ఆర్.ఓ: నాయుడు సురేంద్ర కుమార్ – ఫణి కందుకూరి,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ రెడ్డి తుమ్మ
కో ప్రొడ్యూసర్: దామోదర్ యాదవ్ (వైజాగ్)
నిర్మాతలు: ప్రతిభా అడివి, కట్ట ఆశిష్ రెడ్డి, కేశవ్ ఉమా స్వరూప్, పద్మనాభ రెడ్డి, గ్యారీ బిహెచ్, సతీష్ డేగల, మిగతా ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు
దర్శకత్వం: సాయికిరణ్ అడివి