ఒక్కో సినిమా డిజిటల్ రైట్స్ వలన నిర్మాతలైతే కోట్లు వెనకేసుకుంటున్నారు కానీ.. సినిమాని కొన్న బయ్యర్లకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ఎందుకంటే సినిమా హిట్ అయినా ఫట్ అయినా డిజిటల్ మీడియా అమెజాన్, నెట్ ఫ్లిక్స్ వంటి స్ట్రెమ్మింగ్స్ లో సినిమా విడుదలైన నెలకే పెట్టెయ్యడంతో... ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్లే ఆలోచన విరమించుకుంటున్నారు. సినిమా హిట్ టాక్ వస్తే... కొద్దో గొప్పో థియేటర్స్ బాట పడుతున్న ప్రేక్షకులు ఎక్కువశాతం అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లలోనే సినిమాలు చూసేస్తున్నారు.
అయితే ఒకప్పుడు సినిమాలు హిట్ అయితే రెండు వారాల్లో లాభాల బాట పట్టే బయ్యర్లు.... డిజిటల్ మీడియా అందుబాటులోకొచ్చాక నాలుగువారాలైన లాభాల బాట పట్టలేకపోతున్నారు. అయితే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ మీడియా వలన కలెక్షన్స్ కి గండి కొట్టి బయ్యర్లు నష్టపోతున్న కారణంగా... ఈ సమస్య పరిష్కారానికి నిర్మాతలు అంతా కలిసి డిజిటల్ మీడియాతో కొన్ని ఒప్పందాలు చేసుకుంటున్నారు. సినిమా విడుదలైన 50 రోజులకే సినిమాని డిజిటల్ మీడియాలో పెట్టాలని... కొన్ని కఠిన నిర్మయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే అనేకన్నా... ఇంకాస్త ఆలోచనతో.. అల వైకుంఠపురంలో టీం ఓ సరికొత్త ఆలోచనకు తెరతీసింది.
అదేమిటంటే... మీరు అల వైకుంఠపురంలో సినిమాను అమెజాన్ లోనూ.. నెట్ ఫ్లిక్స్ లోనూ చూడలేరు అంటూ పోస్టర్ ని ప్రింట్ చేసి మరీ వదిలింది. మరి అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో సినిమా లేదంటే సినిమా హిట్ అయితే ప్రేక్షకులు థియేటర్స్ కి బారులు తీరడం ఖాయం. డిజిటల్ మీడియా వచ్చాక థియేటర్స్ మూతబడేలా ఉండడంతో... నిర్మాతలు తీసుకునే ఇలాంటి నిర్ణయాలు నిజంగా అభినందనీయమే.