సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాలకు వెళ్లారు. రజనీ ఏదైనా సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగానే హిమాలయాలకు వెళ్తారన్న సంగతి తెలిసిందే. ఇది సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పట్నుంచి ఆయనకు ఆనవాయితీగా వస్తోంది. తాజాగా.. రజనీ హీరోగా నటించిన ‘దర్బార్’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది.. ఈ సందర్భంగా గుమ్మడికాయ కొట్టేసిన ఆయన.. ఉత్తరాఖండ్‌కు వెళ్లిపోయారు.
ఇవాళ చెన్నై నుంచి ఆయన డెహ్రాడూన్‌కు ప్రత్యేక విమానంలో రజనీ బయల్దేరి వెళ్లారు. డెహ్రాడూన్ వెళ్లిన తర్వాత అక్కడ్నుంచి కారులో షికారు చేస్తూ కేదార్‌నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్య క్షేత్రాలను రజనీ సందర్శించనున్నారని తెలుస్తోంది. ఈ సందర్శన అయిపోయిన అనంతరం రజనీ ప్రత్యక్షదైవంగా భావించే బాబా గుహకు వెళ్లి ధ్యానం చేయనున్నారు. ఇలా మొత్తం హిమాలయాల్లో 10 రోజులకు తగ్గకుండా ఆయన గడిపి చెన్నైకు తిరుగుపయనం చేయనున్నారు. అనంతరం దర్బార్ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకూ సినిమాల పరంగానే హిమాలయాలకు వెళ్లే రజనీ.. రాజకీయ రంగప్రవేశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. గత 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో వస్తానంటూ అభిమానులను ఊరిస్తూ వస్తున్న రజనీ.. ఈసారి ఏదో ఒకటి తేల్చేయాలని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌లోపు పార్టీ స్థాపించేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. జయలలిత మరణంతో తమిళనాట రాజకీయ శూన్యం ఏర్పడిందన్న విషయం విదితమే. మొత్తానికి చూస్తే.. ఈసారి హిమాలయాలకు రజనీ వెళ్లడం వెనక పొలిటికల్‌గా పెద్ద రీజనే ఉందన్న మాట. మరి ప్రకటన ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే మరి.