ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి- టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 14న భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకసారి ఈ భేటీ వాయిదా పడినప్పటికీ ఎట్టకేలకు మళ్లీ తేదీ ఖరారైంది. వైఎస్ జగన్‌ను కలవాలని అపాయిట్మెంట్ అడగడం మొదలుకుని.. భేటీ వాయిదా.. మళ్లీ తేదీ ఖరారు కావడం వరకూ ప్రతిదీ ఇటు సినిమా ఇండస్ట్రీలో.. అటు రాజీకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు ఇప్పటికిప్పుడు సీఎం జగన్‌ను కలవాల్సిన అవసరం చిరుకు ఏంటి..? ఈ భేటీ వెనుక ఆంతర్యమేంటి..? అనే ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.
వాస్తవానికి చిరు ఇప్పుడు రాజకీయాలకు ఎప్పట్నుంచో దూరంగా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం మళ్లీ సినిమాలతో బిజిబీజీగా గడుపుతున్నాడు. అంతేకాదు... పాలిటిక్స్ అనే పదం వినపడని, కనపడనంత దూరంగా ఉంటున్నారు. జనసేన అధినేత, చిరు తమ్ముడు పవన్ కల్యాణ్ కూడా రాజకీయంగా బద్ధ శత్రువన్న విషయం విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో చిరు-జగన్ భేటీ అయ్యి ఏం చర్చిస్తారు..? అసలు వీరి మధ్య ఏయే విషయాలు చర్చకు రానున్నాయనే విషయంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కాసింత క్లారిటీ ఇచ్చారు.
‘చిరు-జగన్ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ కోణాలు లేవు. కేవలం ‘సైరా’ సినిమా పరంగానే ఈ చర్చలు ఉండబోతున్నాయి. అంతేకానీ అంతకు మించి ఏమీ లేదు.. ఉండదు’ అని మంత్రి కాసింత క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిసైను కలిసిన మెగాస్టార్.. సినిమా చూడాలని ఆహ్వానించి స్పెషల్ షో వేయించారు. అయితే త్వరలో జగన్‌తో జరగనున్న భేటీలో కూడా ‘సైరా’ సినిమా వీక్షించాలని ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా.. వైఎస్ ఫ్యామిలీతో-చిరుకు మంచి సన్నిహిత సంబంధాలున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే.