నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌పై మరో ప్రముఖ నిర్మాత పీవీపీ కేసులు పెట్టడంతో అతనిని అరెస్ట్ చేయడానికి పోలీసులు చూస్తున్నారు. అయితే పరారీలో ఉన్న బండ్ల గణేష్ అసలు ఈ విషయంలో ఏం జరిగిందీ అనేది ట్విట్టర్ ద్వారా తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. శనివారం నుంచి ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్స్ చేస్తూనే ఉన్నారు. ఇది పీవీపీ నిజ స్వరూపం అంటూ ఏపీ ముఖ్యమంత్రికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. చివరికీ ఈ విషయం ఎటువైపు దారితీస్తుందో తెలియదు కానీ, బండ్ల గణేష్ మాత్రం తన ఆవేదనను ట్వీట్ల రూపంలో వెల్లుబుచ్చుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన చేసిన ట్వీట్లను ఒక్కసారి పరిశీలిస్తే..
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గౌరవనీయులైన జగన్ గారికి.. సార్.. మమ్మల్ని అందరినీ నిర్మాత పీవీపీ బారి నుంచి కాపాడండి. అందరూ ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి లేని పాలన జరుగుతుందని ఆనందపడుతూ ఉంటే తులసివనంలో గంజాయి మొక్కల్లాంటి ఇలాంటివారి వల్ల పార్టీకి మీకు చెడ్డ పేరు వస్తుంది. ఓడిపోయిన కేసుల్లో కూడా మళ్లీ డబ్బులు కావాలి అని బెదిరిస్తున్నారు. మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ నా చేతుల్లో ఉంది మీ అందర్నీ చంపేస్తాను అంటున్నాడు. రాజన్న రాజ్యం వచ్చిందని ఆనందంతో బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఇలాంటి దుర్మార్గుడి చేతినుంచి కాపాడండి సార్. మీ పేరు చెప్పి చిత్రపరిశ్రమలో అందర్నీ బెదిరిస్తున్నారు దయచేసి కట్టడి చేయండి. కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో విజయవాడ నగర ప్రజలు ఎంత అదృష్టవంతులో నాకిప్పుడు అర్థమవుతుంది. అమ్మో.. చిన్న పొరపాటు జరిగి ఉంటే ఘోరప్రమాదం జరిగిపోయేది. డేకి, వర్కింగ్ డేకి, కాల్ షీట్‌కు, మామూలు షీట్‌కు, మేకప్‌కి ప్యాకప్‌కి తేడా తెలియని కొందరు స్కామ్ రాజాలు ఇండస్ట్రీని భ్రష్టుపట్టించారు. తీసిన ప్రతి హీరోతో గొడవే. ప్రతి డైరక్టర్‌తో పంచాయతీనే. ప్రతి నటుడితో గొడవలే. మాట్లాడితే కోర్టులు, కేసులు. ఇండస్ట్రీకి హిట్‌లు, బ్లాక్ బస్టర్లు ఇవ్వడం తెలుసు కానీ కోర్టుల చుట్టూ తిరగడం కొత్తగా నేర్పాడు ఈ స్కామ్ రాజా. ప్రపంచంలో నేను ఏ దేశానికైనా హ్యాపీగా వెళ్లి తిరిగివస్తా. కొందరు స్కామ్ రాజాలు వేరే దేశాలకు వెళ్తే అరెస్టు చేసి బొక్కలో వేస్తారట. అందరూ చెప్పుకుంటుంటే విన్నా. నిజమో కాదో నాకు తెలియదు. ప్రపంచం, భారతదేశం మొత్తం గర్వించదగ్గ నటుడు, పద్మశ్రీ కమల్ హాసన్ గారినే కోర్టుకు లాగిన నీచ చరిత్ర నీది. తొమ్మిదేళ్ల పాటు తన రక్తాన్ని పణంగా పెట్టి, తమ చెమటను చిందించి, రాత్రి అనక పగలు అనక కుటుంబానికి దూరంగా గడిపి చేజిక్కించుకున్న అధికారాన్ని కొందరు దుర్మార్గులకు పెత్తనాలు ఇచ్చి, మీ కీర్తిని పాడు చేసుకోవద్దని గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్ గారికి నా వినయపూర్వక విన్నపం.
ఎవరన్నా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతారు, లేదా కోర్టుల్లో కేసు వేసి న్యాయం కోసం పోరాడతారు. ఓ భారతీయుడిగా చేయాల్సిన పని ఇది. కానీ 14 ఏళ్ల పాటు పగలు రాత్రి తన దగ్గర పని చేసిన భానుప్రకాష్ అనే ఉద్యోగిని ఈ స్కామ్ రాజా, కిడ్నాప్ చేసి, బంధించి, దారుణంగా హింసించి, అతని పేరిట వున్న ఆస్తులు తన పేరిట రాయించుకుని, వదిలేసారు. భాను భార్య కూకట్ పల్లి స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే, బలవంతంగా విత్ డ్రా చేయించారు. తన ఉద్యోగినే అలా చేస్తే విజయవాడ ప్రజలను ఏం చేస్తారో? అలాగే తిమ్మారెడ్డి అనే క్యాషియర్ ను విజయవాడ తీసుకుపోయి కొట్టి, చేయి విరగ్గొట్టి, కార్లు లాక్కుని, ఆస్తులు రాయించుకున్నారు. గౌరవనీయ ముఖ్యమంత్రి పేరు చెప్పి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, రౌడీ షీటర్లతో రాజ్యం ఏలాలని అనుకుంటున్నారా? అద్భుతమైన పరిపాలన అందిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్ గారికి విన్నపం ఇస్కాన్ రాజా నుంచి ఇండస్ట్రీని, ప్రజలను అందర్నీ కాపాడండి..’’ అంటూ బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను వేడుకున్నారు.