నటుడు బండ్ల గణేష్ పరారీలో ఉన్నాడంటూ శనివారం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ప్రముఖ నిర్మాత, తనని బెదిరించాడంటూ అతనిపై కేసు పెట్టాడని, కొన్ని సెక్షన్‌ల ప్రకారం అతనిపై కేసు నమోదు చేశారని, కనిపిస్తే అరెస్ట్ చేస్తారని తెలిసి బండ్ల గణేష్ పరారయ్యాడనేది వార్తల సారాంశం. ఇది ఇలా ఉంటే పీవీపీ అనే నిర్మాత అయిపోయిన కేసులను బయటికి తీస్తూ, తనని బెదిరిస్తున్నాడని, తన నుండి ప్రాణహాని ఉందని ముందుగానే బండ్ల గణేష్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పీవీపీపై ఫిర్యాదు చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే అసలు ఇద్దర అగ్ర నిర్మాతల మధ్య ఈ గొడవకు కారణం ఏమిటి? అనే విషయంలోకి వస్తే..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన టెంపర్ సినిమాకు సంబంధించి సినీ ఫైనాన్షియర్, సహ నిర్మాత పొట్లూరి వరప్రసాద్.. బండ్ల గణేష్‌కు రూ.30 కోట్లు పెట్టుబడి పెట్టారు. సినిమా విడుదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించిన గణేష్, వడ్డీ నిమిత్తం పీవీపీకి చెక్కులు ఇచ్చారు. చెక్కులు బౌన్స్ అవ్వడంతో మిగిలిన డబ్బును చెల్లించాలంటూ గణేష్‌ను పీవీపీ కోరారు. అయితే ఇదంతా అప్పుడే కోర్టులో కేసు నడిచి సద్దుమణిగింది. మళ్లీ ఇప్పుడు పీవీపీ ఆ డబ్బుల కోసం బండ్ల గణేష్‌ని టార్గెట్ చేయడంతో, ఇరు వర్గాల మధ్య వార్ మొదలైంది.