బాహుబలి రెండు పార్ట్‌లలో అవంతికగా నటించిన తమన్నాకు స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ దొరికిందనే చెప్పాలి. మొదటి పార్ట్‌లో కాస్త పరవాలేదు కానీ, రెండో పార్ట్‌లో మాత్రం తమన్నా కనిపించేది చాలా అంటే చాలా తక్కువ టైమే. ఆ సినిమా అంత పెద్ద హిట్టు అయినప్పటికీ తమన్నాకు మాత్రం ఏ విధంగానూ ఉపయోగపడలేదు అన్నది వాస్తవం. బాహుబలి తర్వాత తమన్నా.. అవకాశాల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచం మెచ్చిన చిత్రంలో నటించాననే సంతృప్తి తప్ప.. తమన్నాకి ‘బాహుబలి’ ద్వారా వచ్చిందేమీ లేదు. ఆ చిత్ర క్రెడిట్ అంతా ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, కట్టప్పగా చేసిన సత్యరాజ్‌లే కొట్టేశారు. కానీ తాజాగా ఆమె నటించిన సైరాలో మాత్రం అలా జరుగలేదు.
‘సైరా’ చిత్రంలో లక్ష్మీగా, నరసింహారెడ్డి ప్రియురాలిగా, నర్తకిగా పలు షేడ్స్ ఉన్న పాత్ర తమన్నాకి దక్కింది. ఇంకా చెప్పాలంటే చిరంజీవి పాత్ర కంటే కూడా ముందు తమన్నా పాత్ర గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఇది ఒకరు చెప్పింది కాదు. రీసెంట్‌గా జరిగిన థ్యాంక్స్ మీట్‌లో స్వయంగా మెగాస్టార్ చిరంజీవే అన్నారు. నిజంగానే ‘సైరా’ చిత్రంలో తమన్నాకు చాలా మంచి పాత్ర లభించింది. పాత్రలో చక్కగా ఒదిగిపోయిన తమన్నా.. ‘సైరా’ చిత్రానికి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్‌గా గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాదు ఇకపై ఇలాంటి చారిత్రాత్మక చిత్రాలు ఎవరైనా తీయదలిస్తే.. అందులో తప్పకుండా తమన్నాకు ఓ పాత్ర ఉండేలా.. ఆమె నటన, హావభావాలు ఈ చిత్రంలో ప్రదర్శించింది. ఈ విషయంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డిని కూడా అభినందించాలి. ఈ పాత్రకు ఆమెను సెలక్ట్ చేసినందుకు.
ప్రస్తుతం తమన్నాకు టాలీవుడ్‌లో అవకాశాలు కూడా ఆహ్వానిస్తున్నాయి. అంతా అయిపోయింది అనుకుంటున్న తరుణంలో ‘సైరా’ చిత్రం తమన్నాకు ఊపిరిపోసిందనే చెప్పాలి. ఈ రకంగా చూస్తే బాహుబలి కంటే కూడా సైరానే ఆమెకు మంచి పేరు తీసుకువచ్చిందన్నది మాత్రం వాస్తవం అని చెప్పక తప్పదు.